- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌లో కల్లోలం.. ఏడేండ్లలో పాతాళానికి..!
దిశ, తెలంగాణ బ్యూరో : ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చతికిలబడింది. కేసీఆర్‌కు ఎదురు నిలబడే స్థాయిలో కూడా అందిపుచ్చుకోవడం లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ చెప్పే నేతలే వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ కావడం లేదు. ఒకరిద్దరు నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా… అడ్డు తగిలే నేతలు సొంత పార్టీలోనే ఉండటంతో ముందుకెళ్లలేకపోతున్నారు.
ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో పాతాళానికి పడిపోయింది. ప్రతిపక్ష బాధ్యతల్లో ఉన్నా… అధికార పక్షానికి కోవర్టులుగా మారారనే అపవాదును నేతలు మూటగట్టుకుంటున్నారు. అలాంటి ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే అధిష్టానం నడుచుకుంటోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్నాకు వద్దంటూ మూడుసార్లు రాజీనామా చేసినా ఉత్తమ్‌నే కొనసాగిస్తున్నారు. కనీసం పార్టీకి అధ్యక్షున్ని ప్రకటించే పరిస్థితి కూడా లేదు. దానికి కూడా సీఎం కేసీఆర్ అనుమతి కావాలేమో… అనే స్థాయికి పార్టీ చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఏటేటా పతనానికి..!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సోనియాగాంధీ చలువే. దీన్ని స్వయంగా కేసీఆర్‌తో పాటు ప్రతి ఒక్కరూ ఒప్పుకున్న అంశమే. కానీ అలాంటి పరిస్థితిని కాంగ్రెస్ కనీసం అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేయడం లేదనేది రాష్ట్రంలో ఉంది. మరోవైపు కేసీఆర్ఏడేండ్ల పాలనపై విమర్శలున్నాయి. ఉద్యోగాల నియామకం లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు… అప్పుల తెలంగాణ అంటూ చెప్పుకుంటున్నా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. తొలి నాలుగున్నరేండ్లలో ఒకింత మెరుగ్గానే కనిపించినా ఆ తర్వాత మాత్రం అధ్వాన్నంగా మారింది. టీఆర్ఎస్ ముందు నిలబడలేకపోతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కానుందా అనే అనుమానాలున్నాయి. అసలు కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు..? ఆఖరికి కాంగ్రెస్‌లో ఎంతమంది మిగులుతారు..? అనేదానిపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే ఫలితాల తర్వాత ఒక్కరు.. ఇద్దరు.. కాదు ఏకంగా ఇప్పటి వరకూ 13 మంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ఇక కాంగ్రెస్‌కు మిగిలింది కేవలం ఐదుగురే. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి, పొడెం వీరయ్యతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఇక రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా… లేనట్టే. ఏకంగా 13 మంది పార్టీ మారడంలో ఎవరి నిర్లక్ష్యం అనేది ఆ పార్టీ ఇప్పటికీ తేల్చుకోలేకపోతోంది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో అంతర్యుద్ధం, వర్గ పోరు, ఆధిపత్య పోరు, నాయకత్వ లేమి ఇలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి తయారయ్యింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న స్వయం కృతాపరాధమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.
సారథి లేని పార్టీ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీలోని నాయకులు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేడు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అమేథీలో ఓటమి చవిచూసి పార్టీ పగ్గాలను వదిలేసిన పరిస్థితి… దాని ప్రభావం మన రాష్ట్రం మీద స్పష్టంగా కనపడుతోంది. ఎంత మేరకు అంటే రాష్ట్రంలో ఆచూకీ లేని బీజేపీ… ఒక దశలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనే పరిస్థితికి తీసుకురావడంలో కాంగ్రెస్ నేతలే సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
ఒంటరి పోరుతో ఎలా..?
కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారనేది ముందు నుంచీ జరుగుతున్న ప్రచారమే. కొన్ని పరిణామాలు అందుకు అనుగుణంగానే సాగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఎలా ఉన్నా… రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. అయితే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనుకున్న కాంగ్రెస్ ప్రజలకు అసంతృప్తినే మిగిల్చింది.
ఇకపై రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, ఆకలి చావులు, నిరుద్యోగం ఉండవని, ఉద్యమాలు, పోరాటాలు చేసే అవసరం లేదన్నప్పటికీ… స్వరాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు వంటి ప్రధానాంశాల్లో విఫలమైనట్లు అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాయి.
మరోవైపు ఇటీవల భూ కబ్జాలు, అవినీతి, ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఒంటరిపోరుకు దిగుతున్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి దీనిపై జైలుకు కూడా వెళ్లివచ్చాడు. కానీ ఆయనకు అండగా నిలిచే సీనియర్ నేతలు కరువయ్యారు. అంతేకాదు విమర్శలకు దిగారు. అటు ఎమ్మెల్యే సీతక్క కూడా గిరిజన ప్రాంతాల్లో పట్టు సాధించుకుంటున్నా వ్యక్తిగత ఇమేజ్‌కే పరిమితమవుతోంది.
మరోవైపు కాళేశ్వరం అంశంపై ఇటీవల భట్టి విక్రమార్క ఫైట్‌కు దిగినా… కొంతమంది నేతలు దానికి దూరంగా ఉన్నారు. ఒకదశలో ఎంపీ రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తే… సీనియర్లు ముఖం చాటేశారు. ఇలాంటి పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సిన కాంగ్రెస్.. దూరంగా ఉంటుండంతో కోవర్టు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి.
మార్పు ఎందుకు లేదు..?
ఒక్క ఓటమి ఎన్నో గుణ పాఠాలను నేర్పుతుందనేది సామెత. కానీ గత ఏడేండ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతున్నా కాంగ్రెస్ వైఖరిలో కొంతయినా మార్పు కానరావడం లేదు. గడిచిన ఏడేండ్లలో పార్టీ ఎన్ని ఓటములు చవిచూసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో నుంచి మొదలుకుని నిన్న జరిగిన సాగర్ ఉప ఎన్నికల వరకు ఆ పార్టీ యోధానుయోధులు కూడా ఘోరమైన రీతిలో ఓటమి చవిచూశారు. తెలంగాణ ఇచ్చింది తామేనని పదే పదే చెప్పుకునే ఆ పార్టీ నేడు అదే తెలంగాణలో ఈ పరిస్థితికి దిగజారిందంటే ఇంతకంటే అవమానం మరోకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు ప్రస్తుతం ఉన్నవాళ్లలో సమర్థుడైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగిద్దామంటే సదరు పార్టీకి సీనియర్లుగా చెప్పబడుతున్న, ప్రజల్లో ప్రాబల్యం తగ్గిన సీనియర్లు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మాత్రమే ఫేమస్ అవుతున్నా… మిగతా లీడర్ల పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని నాయకులు కింది స్థాయి కార్యకర్తలను పాటించుకోకపోవడం కూడా పార్టీలో ప్రధాన సమస్యగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, శ్రీధర్‌బాబుతో పాటుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటి నేతలు కూడా అప్పుడప్పుడు తప్ప పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకతను ఇప్పుడున్న పరిస్థితుల్లో అందిపుచ్చుకుంటే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని కొంత మేరకు గ్రామస్థాయి నుంచి చర్చ ఉన్నా… కారణాలేమైనా ఫెయిల్ అవుతోంది. దీంతో ఏడేండ్లకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి.