లైసెన్స్ దుకాణాల్లోనే కొనండి : కలెక్టర్ శశాంక

by Sridhar Babu |
లైసెన్స్ దుకాణాల్లోనే కొనండి : కలెక్టర్ శశాంక
X

దిశ, కరీంనగర్: రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దని, గుర్తింపు పొందిన లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ అధికారులతో నకిలీ పత్తి విత్తనాల నిర్మూలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మండల పరిధిలో ప్రత్యేక ప్రణాళిక ప్రకారం నకిలీ విత్తనాల స్టాక్ పాయింట్లపై నిఘా పెట్టి దాడులు చేయాలని ఆదేశించారు. వరి విత్తనాల కన్నా పత్తి విత్తనాల్లోనే ఎక్కువగా నకిలీ జరిగే అవకాశం ఉంటుందని అధికారులు సమన్వయంతో పనిచేస్తే, కట్టడి చేయగలమన్నారు. నకిలీ విత్తనాల విషయంతో డీలర్లు, రైతులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం వానాకాలం-2020 సీజన్ లాభాదాయకంగా పంటలు వేసేందుకు వినూత్న వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే రెండు నకిలీ విత్తనాల షాపులను సీజ్ చేశామని వివరించారు. నకిలీ ఎరువులు అమ్మే వారి సమాచారం అందించినట్టయితే దాడులు చేసి పట్టుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.

నకిలీ విత్తనాల అమ్మే వారిపై పీడీ యాక్ట్ : సీపీ కమలాసన్ రెడ్డి

నకిలీ విత్తనాలను గుర్తించే విషయంపై పోలీస్ అధికారులకు అవగాహన కల్పించామన్నారు. నకిలీ విత్తన వ్యాపారులను కట్టడి చేసేందుకు అందరి సహాకారంతో ముందుకెళ్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమన్వయంతో పనిచేస్తేనే విజయం సాధించగలుగుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed