అమల్లోకి మోడల్ కోడ్.. అందుకు అనుమతి తప్పనిసరి : కలెక్టర్

by Shyam |   ( Updated:2021-11-10 10:17:59.0  )
Nizamabad Collector Narayana Reddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డి కోరారు. బుధవారం ప్రగతి భవన్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో మంగళవారం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నెల 16 నుంచి నామినేషన్‌ల స్వీకరణ జరుగనుందన్నారు. 23 వరకు నామినేషన్‌ల స్వీకరణ, 24న నామినేషన్‌ల పరిశీలన-తిరస్కరణ జరుగుతుందని తెలిపారు. ఈనెల 26న విత్ డ్రా, డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 824 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గతంలో మండలానికి ఒక పోలింగ్ కేంద్రం ఉండగా, ఈసారి డివిజన్‌కు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ఎక్స్ ఆఫీషియో హోదాలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఓటు హక్కు అవకాశం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరు డివిజన్ కేంద్రాల్లో ఎన్నికల కోడ్ అమలు బాధ్యతలను రెవెన్యూ డివిజనల్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా ఆర్డీవో, పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని సూచించారు.

అంతకు ముందు రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నియమాలను పాటించాలని అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో ఓటర్ల తుది జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడిస్తామని అన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వాహణ ఉంటుందన్నారు. గత ఏడాది ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించిన నేపథ్యంలో అధికారులకు ప్రజలు, పార్టీల నేతలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నిజామాబాద్ డీసీపీ అరవింద్ బాబు, అదనపు జేసీ చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed