వరి సాగుపై పునరాలోచన చేయండి.. రైతులకు కలెక్టర్ సూచన

by Shyam |
Mahabubabad Collector
X

దిశ‌, దంతాలపల్లి: భారత ఆహార సంస్థ యాసంగి ధాన్యాన్ని కొనలేమని స్పష్టం చేసినందున రైతులు వరిపంట వేసి ఇబ్బందులు పడకూడదని, ఆరుతడి పంటలనే పండించాలని మ‌హ‌బూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. బుధవారం ఆయ‌న దంతాలపల్లి మండలం గున్నేపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వ‌ద్ద ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన హాజ‌రై మాట్లాడారు. గత వాన కాలంలో 1.26 ల‌క్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ సీజ‌న్‌లో ధాన్యం రెండింత‌లకు పైచిలుకు వచ్చిందన్నారు. గత వానాకాలం ధాన్యమే గోదాముల్లో పేరుకుపోయింద‌ని అన్నారు. ఈసారి వ‌చ్చిన ధాన్యానికి నిల్వ స్థలం లేద‌న్నారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్లో 1220 ఆవాస గ్రామాలు ఉన్నాయని 82 రైతు వేదికల ద్వారా రైతులను చైతన్య కార్యక్రమాలు చేపట్టామని పోస్టర్ల ద్వారా కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం కూడా చేస్తున్నామని రైతులు యాసంగిలో వ‌రి సాగుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

ఆరుతడి పంటలపై రైతాంగం దృష్టి పెట్టినందున నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మ‌రోవైపు మూడున్నర లక్షల ఎకరాల అటవీ భూమిలో 92 వేల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమం చేపట్టి జంతువులను తిరిగి అడవులకు పంపాలనే లక్ష్యంతో మొక్కలను నాటడం జరిగిందన్నారు. అనంత‌రం న‌ర్సింహులపేట మండ‌లం రామ‌న్నగూడెంలో ఓ రైతు సాగు చేసిన బొప్పాయితోట‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సమ్మెట రాము, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యానశాఖ అధికారి సూర్యనారాయణ, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మండల కో-ఆర్డినేటర్ మల్లారెడ్డి, త‌హ‌సీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.

Advertisement

Next Story