‘ఆత్మ నిర్భర్’‌తో పరిశ్రమలకు ఊరట

by  |
‘ఆత్మ నిర్భర్’‌తో పరిశ్రమలకు ఊరట
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజీ పారిశ్రామికవేత్తలతో పాటు వలస కూలీలకు ఊరటనిచ్చింది. ఈ పథకం ఆశించిన మేర ఫలితం ఇస్తే మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 33వేల మంది కార్మికులకు ఉపాధి భరోసా కలగనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3526 పరిశ్రమలు ఉండగా వాటిల్లో 2812 సూక్ష్మ, 645 చిన్నతరహా, 69 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా జాతీయ రహదారి హైదరాబాద్ చేరువ ప్రాంతాలైన జడ్చర్లలోని పోలేపల్లి, బాలానగర్, రాజాపూర్ ప్రాంతాల్లో ఔషధ, రసాయన, స్టీల్, తదితర రకాల పరిశ్రమలు వున్నాయి. నారాయణపేట, మక్తల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటుక బట్టీల‌పై చాలా మంది జీవనం సాగిస్తున్నారు. అలాగే నాగర్ కర్నూల్, అచ్చంపేటతో పాటు వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, జోగులాంబ గద్వాల తదితర ప్రాంతాల్లో కూడా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండడంతో ఈ ప్రాంతాల్లో వలస కూలీల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గత మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రాంతాల్లోని అనేక పరిశ్రమలు మూతపడడంతో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అదే సమయంలో చాలా మంది పారిశ్రామిక వేత్తలు కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అయితే కేంద్రం ప్రకటించిన పథకం వల్ల సూక్ష్మతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న సుమారు 20 వేల కార్మికులతో పాటు చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న12వేల మంది, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న సుమారు 2 వేల మంది కార్మికుల ఉపాధికి భరోసా కల్పించినట్టయ్యింది.

లావాదేవీల పరిమితి పెంపు

ఈ పథకం కింద ప్రస్తుతం సూక్ష్మ తరహా పరిశ్రమల లావాదేవీలు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు పెంచారు. చిన్న తరహా పరిశ్రమల వ్యాపార లావాదేవీలు రూ.కోటి నుంచి రూ.10 కోట్లకు, మధ్య తరహా పరిశ్రమల లావాదేవీలను రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో అధికంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికులే అధికంగా ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా చాలామంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొంత మంది కూడా అదే దారిలో వున్నారు. అధికారులు వారిని నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేసినా కూడా పరిశ్రమలు తెరవాలంటే కావాల్సిన కార్మికులు దొరకడం కష్టంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన పథకం వల్ల కొంత మేర ప్రయోజనం చేకూరుతుందని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.


Next Story

Most Viewed