ఐపీఎల్ పుట్టుక..!

by  |
ఐపీఎల్ పుట్టుక..!
X

దిశ, స్పోర్ట్స్: ఇప్పుడంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బీసీసీఐకి బంగారు గుడ్లు పెట్టే బాతు. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డుగా మారడంలో ఐపీఎల్‌దే కీలక పాత్ర. కానీ ఈ లీగ్ పుట్టింది మాత్రం డబ్బుల కోసం కాదు. ఇండియాలో బీసీసీఐ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసిన ఇండియన్ క్రికెట్ లీగ్‌ (ఐసీఎల్)ను ఢీ కొట్టడానికి 2008లో ఐపీఎల్ పుట్టింది. బీసీసీఐ తమకు క్రికెట్ ప్రసార హక్కులు ఇవ్వలేదనే కోపంతో జీటీవీ 2007లో ఐసీఎల్‌కు పురుడు పోసింది. మూడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ లీగ్.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలకు చెందిన కీలకమైన క్రికెటర్లను తన వైపు లాగేసుకుంది. కపిల్ దేవ్ చైర్మన్‌గా జీటీవీ యజమాని సుభాష్ చంద్ర ఈ ఐపీఎల్‌ను రూపొందించాడు. టీ20 ఫార్మాట్‌లో ఏడు ఇండియన్ జట్లు, ఒక పాకిస్తాన్ జట్టు, మరొక బంగ్లాదేశ్ జట్టుతో ఈ లీగ్ ఆడించారు. ఇంజమామ్ ఉల్ హక్, అంబటి రాయుడు, రోహన్ గవాస్కర్, స్టువర్ట్ బిన్నీ, అజార్ మహమూద్, ఇమ్రాన్ నజీర్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్‌తో భాగస్వామ్యమయ్యారు. దీంతో బీసీసీఐతో పాటు ప్రపంచ క్రికెట్ సమితి (ఐసీసీ) కూడా వణికిపోయింది.

జీటీవీ ఇండియాలో క్రికెట్ ప్రసార హక్కుల కోసం అప్పట్లో పలుమార్లు బీసీసీఐని సంప్రదించింది. అప్పటికే టెన్ స్పోర్ట్స్ తో బీసీసీఐకి ఒప్పందం ఉంది. దీంతో టెన్ టీవీలో జీటీవీ వాటాలు కొన్నది. క్రికెట్ కోసమే జీ స్పోర్ట్స్ అనే చానల్ కూడా ప్రారంభించింది. 2000లో క్రికెట్ హక్కుల కోసం జీటీవీ అందరి కంటే ఎక్కువ బిడ్డింగ్ దాఖలు చేసింది. కానీ అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా జీటీవీకి హక్కులు కేటాయించడానికి నిరాకరించాడు. 2000లో కూడా మరోసారి బిడ్ వేసినా జీటీవీ కంటే తక్కువ కోట్ చేసిన ఈఎస్‌పీఎన్ స్టార్‌కు బీసీసీఐ హక్కులు ఇచ్చింది. దీన్ని మనసులో పెట్టుకున్న సుభాష్ చంద్ర బీసీసీఐని దెబ్బ కొట్టాలని వ్యూహం రచించాడు. ఐసీసీ,బీసీసీఐల ఉనికే లేకుండా చేయాలని భావించి టీ20 ఫార్మాట్‌లో ఐసీఎల్‌ను రూపొందించాడు. ఐసీసీ తొలి టీ20 వరల్డ్ కప్ నిర్వహించిన 2007లోనే ఇండియాలో ఐసీఎల్ ప్రారంభమైంది. భారత టీ20 జట్టులో చోటు దొరకని స్టార్ ప్లేయర్లను డబ్బు ఎరవేసి బయటకు లాగేశారు. దీనికి లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పూర్తిగా సహకరించాడు. దీంతో ఆయననే ఐసీఎల్ కు చైర్మన్‌ని చేశారు. సునీల్ గవాస్కర్, అజారుద్దిన్ వంటి క్రికెటర్లు తెరవెనుక సహాయం చేశారనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి.

ఇండియాకు ఈఎస్‌పీఎన్ చానల్‌ను తీసుకువచ్చింది మీడియా వ్యాపారవేత్త, ప్రముఖ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ లలిత్ మోడీ. 1995లో ఆయన బీసీసీఐని కలసి ఒక 50 ఓవర్ల క్రికెట్ లీగ్‌ను ప్రతిపాదించాడు. కానీ బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఎప్పుడైతే ఐసీఎల్ ప్రారంభమైందో వెంటనే బీసీసీఐ లలిత్ మోడీని రంగంలోకి దింపింది. బీసీసీఐ కోసం ఒక క్రికెట్ లీగ్‌ను రూపొందించాలని కోరింది. దీంతో మోడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను రూపొందించాడు. విదేశీ, స్వదేశీ ఆటగాళ్లతో ఫుట్‌బాల్ లీగ్ లాంటి దానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. దీనికి బీసీసీఐ పచ్చజెండా ఊపింది. మల్టీస్క్రీన్ మీడియా (సోనీ టీవీ)తో పదేళ్ల కాలానికి ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ లీజింగ్ అండ్ ఫైనాన్స్ (డీఎల్‌ఎఫ్) టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. రిలయన్స్,ఇండియా సిమెంట్స్, డెక్కన్ క్రానికల్,జీఎంఆర్,యునైటెడ్ స్పిరిట్స్ వంటి బడా సంస్థలతో మోడీ ఫ్రాంచైజీలు కొనిపించాడు. రూ. వేల కోట్లు ఫ్రాంచైజీల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాకు చేరాయి. విస్తృతంగా మార్కెటింగ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌పై క్రేజ్ పెరిగిపోయింది. ఆటగాళ్లను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్నారు. ఎంతో అట్టహాసంగా తొలి ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభమైంది. లలిత్ మోడీనే ఈ లీగ్ కు ఫౌండర్ కమిషనర్ అండ్ చైర్మన్‌గా వ్యవహరించాడు. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగాడు. ఐపీఎల్ దెబ్బకు కేవలం రెండు సీజన్లు మాత్రమే కొనసాగిన అనంతరం ఐసీఎల్ 2008లో మూటాముల్లె సర్దుకుంది.

2008లోనే లలిత్ మోడీ చైర్మన్ గా ప్రపంచ స్థాయిలో ఛాంపియన్స్ లీగ్‌ ను కూడా ఏర్పాటు చేశారు. ఐపీఎల్ లాంటి ఇతర దేశాల క్రికెట్ లీగ్స్ లో గెలిచిన చాంపియన్ జట్లతో ఈ లీగ్ ను నడిపించారు. 2010లో మోడీని ఐపీఎల్ చైర్మన్‌ పదవి నుంచి తొలగించిన తర్వాత బీసీసీఐ ఈ లీగ్‌ను కొన్నాళ్ల పాటు నడిపింది. అయితే ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువవడంతో 2014లో ఈ లీగ్ ను రద్దు చేసింది.



Next Story