మిడతల దాడిని ఎదుర్కొంటాం : కలెక్టర్

by Shyam |
మిడతల దాడిని ఎదుర్కొంటాం : కలెక్టర్
X

దిశ, వరంగల్: జిల్లాలో మిడతల దాడి జరిగితే ఎదుర్కోవడానికి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. శుక్రవారం సింగరేణి క్లబ్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంతో పాటు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో మిడతల బృందాల కదలిక ఉందని తెలుస్తోందన్నారు. ప్రస్తుతానికైతే జిల్లాపై మిడతల ప్రభావం లేదని, కానీ నాగపూర్ నుంచి దక్షిణం వైపు గాలి వీస్తే లక్షలాది మిడతలు మన రాష్ట్రానికి వచ్చే ప్రమాదం ఉందన్నారు. మిడతల కదలికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో రాష్ట్రస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నట్టు తెలిపారు. అవి మన రాష్ట్రానికి వస్తే ముందుగా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై ప్రభావం ఉంటుందని ఆ వరంగల్ జిల్లాపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నదనే రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో చర్యలు చేపట్టామన్నారు. జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, వ్యవసాయ శాఖ ఏడీ, కాటారం డీఎస్‌పీ ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీ, సర్పంచ్, వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలతో గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ముందస్తు ఆదేశాలు జారీ చేసామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి మిడతలపై రసాయనాలను స్ప్రే చేయడానికి బెంగళూరు నుంచి భారీ డ్రోన్‌ను జిల్లాకు తెప్పిస్తున్నామని, వెయ్యి లీటర్ల క్రిమిసంహారక మందులను సిద్ధం చేశామన్నారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed