ఐపీఎల్‌లోకి మరో రెండు కొత్త జట్లు?

by Shiva |   ( Updated:2021-03-14 05:49:24.0  )
ఐపీఎల్‌లోకి మరో రెండు కొత్త జట్లు?
X

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక బంగారు బాతు లాంటిది. ప్రతీ ఏడాది ఈ లీగ్ ద్వారా రూ. వందల కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరుతున్నాయి. అందుకే కోవిడ్ వంటి మహమ్మారి వచ్చినా.. ఐపీఎల్‌ను మాత్రం విజయవంతం చేసింది. ఖాళీ స్టేడియంలలో విదేశీ గడ్డపై నిర్వహించిన 13వ సీజన్ కూడా బీసీసీఐకి లాభాలు తెచ్చిపెట్టింది. ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ వీవోపై విమర్శలు రావడంతో.. అప్పటికప్పుడు డ్రీమ్ 11ను స్పాన్సర్‌గా తీసుకొని వచ్చి.. నష్టాలు లేకుండా చూసుకున్నది. ఇక రాబోయే సీజన్‌లో 10 జట్లతో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందుకోసం రెండు కొత్త టీమ్‌లను ఐపీఎల్‌లో చేర్చనున్నది. ఈ రెండు టీమ్‌ల వేలం పాటను మే నెలలో నిర్వహించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, గౌరవ కార్యదర్శి జై షా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. శనివారం జరిగిన ఒక సమావేశంలో గతంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వీరిద్దరూ ఆమోదించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

కనీస ధర రూ. 1500 కోట్లు?

ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమై మే 30తో ముగియనున్నది. మే చివరి వారంలో కొత్త ఫ్రాంచైజీల కోసం వేలం పాట నిర్వహించే అవకాశం ఉన్నది. ఒక్కో టీమ్ వేలం పాట ద్వారా కనీసం రూ. 1500 కోట్లు బీసీసీఐకి వచ్చేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అంటే వేలం పాట ద్వారా కనీసం రూ. 3వేల కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరనున్నాయి. అహ్మదాబాద్ కేంద్రంగా ఒక ఫ్రాంచైజీ తీసుకునేందుకు అదానీ గ్రూప్ ఆసక్తిగా ఉంది. ఇక రెండో ఫ్రాంచైజీ లక్నో లేదా కోచ్చి నుంచి ఉండే అవకాశం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు ఒక్కో ఫ్రాంచైజీ బేస్ ప్రైజ్ 50 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అప్పట్లో డాలర్ మారకం ప్రకారం రూ. 175 కోట్లు కనీస ధర. అయితే ఈ ఏడాది మాత్రం కనీస ధర రూ. 1500 కోట్లుగా నిర్ణయించారు. ఒక్కో ఫ్రాంచైజీకి పోటీ ఎక్కువైతే బీసీసీఐకి అంతకంటే ఎక్కువ ధరే వచ్చే అవకాశం ఉంది. పోటీ ఎక్కువైతే బీసీసీఐ రెండు ఫ్రాంచైజీల ద్వారా భారీ ఆదాయాన్ని అర్జించినట్లే. మరోవైపు ఈ ఏడాది కొత్త బ్రాడ్‌కాస్టర్ కోసం టెండర్లు కూడా పిలవనున్నారు. దీని ద్వారా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నది.

2008లో ఏం జరిగింది?

2008లో వేలం పాట నిర్వహించినప్పుడు ముంబయి ఇండియన్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ 111.9 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (111.6 మిలియన్), డెక్కన్ చార్జర్స్ (107 మిలియన్), చెన్నై సూపర్ కింగ్స్ (91 మిలియన్), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (84 మిలియన్), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (76 మిలియన్), కోల్‌కతా నైట్ రైడర్స్ (75.09 మిలియన్), రాజస్థాన్ రాయల్స్ (67 మిలియన్) ధరకు వేలం పాటలో అమ్ముడు పోయాయి. మరి ఇప్పుడు రూ. 1500 కోట్లకు ఎవరైనా కొంటారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే దీనికి అందరూ ఢిల్లీ క్యాపిటల్స్‌వైపు చూపిస్తున్నారు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతం వాటాను జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ. 1100 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక ఫ్రాంచైజీలో సగం వాటానే రూ. 1100 కోట్లకు అమ్ముడు పోయినప్పుడు.. కొత్త ఫ్రాంచైజీ కోసం కనీస ధర రూ. 1500 కోట్లు అంటే తప్పకుండా బడా కార్పొరేట్లు ముందుకు వస్తాయని బీసీసీఐ అధికారులు అంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ డీల్ చూసిన తర్వాతే ఈ కనీస ధరను నిర్ణయించినట్లు కూడా సమాచారం అందుతున్నది. అదానీ గ్రూప్ ఎంత ధరైనా వెచ్చించి అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలని భావిస్తున్నది. గతంలో ఫ్రాంచైజీలు కొన్న ఆర్పీజీ కూడా కొత్త ఫ్రాంచైజీల పట్ల ఆసక్తి కనపరుస్తున్నాయి. ఐపీఎల్ 14వ సీజన్ పూర్తయ్యే లోపు కొత్త ఫ్రాంచైజీలేవో తేలిపోనున్నది. అదే సమయంలో బీసీసీఐ భారీ మొత్తంలో ఆదాయాన్ని అర్జించనున్నది.

Advertisement

Next Story