ఆ సర్టిఫికెట్లను అంగీకరించం.. ఇక్కడ ఆ టెస్ట్‌లు చేయించుకోవాల్సిందే

by Shamantha N |
ఆ సర్టిఫికెట్లను అంగీకరించం.. ఇక్కడ ఆ టెస్ట్‌లు చేయించుకోవాల్సిందే
X

డిస్పూర్: కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని అస్సాం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇతర రాష్ట్రాలు జారీ చేసే కరోనా నెగిటివ్ సర్టిఫికెట్స్‌ను తమ రాష్ట్రంలో అంగీకరించబోమని, రైల్వే, విమానాశ్రయాల్లో దిగగానే ప్రయాణీకులు తప్పని సరిగా అక్కడ కరోనా పరీక్షలు చేయించు కోవాల్సిందేనని అస్సాం ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రయాణానికి ముందు 72గంటల్లోపు కరోనా పరీక్షలు నిర్వహించి జారీ చేసిన నెగెటివ్ సర్టిఫికెట్స్‌ను చూపిస్తే రాష్ట్రంలోకి ప్రయాణీకులను అనుమతించేవారు.

కాగా తాజా ఆదేశాల ప్రకారం అలాంటి సర్టిఫికెట్స్ రాష్ట్రంలో చెల్లవు. రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులు ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్‌లలో కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ప్రయాణీకుడికి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. ఒక వేళ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగెటివ్‌గా వస్తే వారు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ రిజల్ట్ వచ్చే వరకు వారు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఈ నిబంధనను రోడ్డు ద్వారా వచ్చే ప్రయాణీకులకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు.

Advertisement

Next Story