హుజూరాబాద్ పోటీపై ఆ పార్టీ అంతర్మథనం

by Anukaran |   ( Updated:2021-08-28 01:45:31.0  )
Huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ హుజూరాబాద్ ఎన్నికలపై దృష్టిసారించాయి. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కానీ ఘన చరిత్ర ఉన్న టీడీపీ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అసలు పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఎన్నికలు కాస్లీ కావడం, రాష్ట్ర పార్టీలో ఇంకా కొంత సందిగ్ధం నెలకొనడంతో నేతలు ఎటు తేల్చుకోలేక పోతున్నారు. మంతనాలతోనే సరిపుచ్చుతారా? బరిలో నిలిచి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపుతారో చూడాలి.

త్వరలో హుజూరాబాద్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు 2023 ఎన్నికలకు కొలమానంగా తీసుకోబోతున్నాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యంతో పాటు భరోసాను నిలిపేందుకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా బరిలో అభ్యర్థిని నింపేందుకు పార్టీనేతలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే నిరుద్యోగులకు, ఫీల్డు అసిస్టెంట్లు బరిలో ఉంటామని పేర్కొనడంతో వైఎస్సార్టీపీ వారికి మద్దతు ప్రకటించింది. అయితే గతంలో రాజకీయ చరిత్రను తిరగరాసిన టీడీపీ పోటీపై సందిగ్ధంలో పడింది. పార్టీ క్యాడర్ ఉన్నప్పటికీ ఇంకా పార్టీ శ్రేణులతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతూనే ఉంది.

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను పార్టీ విశ్లేషిస్తుంది. ఈ మధ్య జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో 1714 ఓట్లు రాగా, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో పోటీ చేయలేదు. దుబ్బాకలో సైతం పోటీకి దూరంగా ఉంది. అయితే నాగార్జున సాగర్ లో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయినప్పటికీ ఎన్నికల్లో ఆశించిన ఓట్లు సాధించలేకపోయింది. మరో పక్క ఎన్నికలు డబ్బుతో కూడుకున్నవి కావడం, పార్టీ నేతలు ఆ స్థాయిలో ఖర్చుపెట్టేవారు లేకపోవడం, రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా లేకపోవడంతో పార్టీ ఓట్లను కూడా వేయించుకోలేకపోయిందని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొంటున్నారు. గత ఎన్నికల విశ్లేషిస్తూ పోటీ చేయాలా? వద్దా అనే అంశంపై సందిగ్ధంలో పడ్డారు.

హుజూరాబాద్‌లో టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపితే పార్టీ శ్రేణుల్లో కూడా కొంత దైర్యం ఇచ్చినట్లు అవుతుందని ఆ పార్టీకి చెందిన నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళా పోటీ చేయకపోతే పార్టీలో నైరాశ్యం నెలకొనే అవకాశం ఉంది. గ్రామస్థాయిలో నేటికీ పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకత్వం లోపించింది. అయితే నూతన అధ్యక్షుడు పార్టీతో పాటు అనుబంధ కమిటీలను సైతం పటిష్ట పరిచే చర్యల్లో భాగంగా పోటీకి అభ్యర్థిని నిలుపాలని పార్టీ నేతలు కోరుతున్నారు. పోటీకి మేము సిద్ధమంటూ హుజూరాబాద్ నుంచి ముగ్గురు పార్టీ నాయకులు అధిష్టానానికి వినతులు అందజేశారు. అయితే అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed