ఆ ఐదు గంటలు.. అంతా మిస్టరీ!

by Anukaran |
ఆ ఐదు గంటలు.. అంతా మిస్టరీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : విప్రో జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీగా మారింది. ప్రమాదానికి ముందు యువకులు వ్యవహరించిన తీరుపై పోలీసుల్లో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. హాస్టల్ నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్రమాదం జరిగిన సమయానికి మధ్య వాళ్లు ఎక్కడకు వెళ్లారు..? ఎవరిని కలిశారు..? ఏం చేశారు..? మళ్లీ హాస్టల్‌కు వెళ్లకుండా రూట్ మార్చి విప్రో వైపునకు ఎందుకు వచ్చారు..? కారును ఎంత స్పీడ్‌లో నడిపారు..? రెడ్ సిగ్నల్ ఉన్నా రోడ్డు క్రాస్ చేయడానికి కారణమేంటీ..? ఇలా ప్రతి అంశాన్ని పోలీసులు శోధిస్తున్నారు. అయితే ప్రమాదంలో ఐదుగురూ మృతిచెందడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారంది. వారికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్పెషల్ టీం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తులో అధునాతన టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది.

రాత్రి 09:33 నుంచి ఉదయం 02:43వరకు..

ఆ ఐదుగురు యువకులు రాత్రి 09:33 గంటలకు మాదాపూర్‌లోని హాస్టల్ నుంచి బయటికి వచ్చారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు రాడిసన్ హోటల్ వద్ద ఆగారు. రాత్రి 11 గంటల సమయంలో డీఎల్ఎఫ్ సమీపంలోని హోటల్ కి వెళ్లారు. గంట పాటు హోటల్‌లోనే గడిపారు. హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మధ్యలో కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకున్నారు. రాత్రి 02 గంటల 30 నిమిషాలకు విప్రో జంక్షన్ కు చేరుకున్నారు. 02 గంటల 43 నిమిషాలకు విప్రో నుంచి గౌలిదొడ్డి వైపు వెళ్తుండగా.. విప్రో జంక్షన్ వద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు.

అన్నీ శేష ప్రశ్నలే..

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. విప్రో జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ రోడ్ క్రాస్‌ చేశారు. అలా గ్రీన్ సిగ్నల్ నుంచి వస్తున్న టిప్పర్‌ని కారు ఢీ కొట్టిందని పోలీసులు గుర్తించారు. యువకులు నడిపిన కారులో కొన్ని మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎక్కడ కొనుగోలు చేశారో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మాదాపూర్‌లోని పీజీ హాస్టల్ కి వెళ్లాల్సిన వాళ్లు విప్రో వైపునకు ఎందుకు వచ్చారో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.

నగరంలోనే ఎందుకీ ప్రమాదాలు..?

నగరం నిద్రపోతున్న వేళలోనే ఎక్కవ రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. రాత్రి 12 గంటలు దాటితే సిటీ రోడ్లన్నీ ప్రశాంతంగా నిర్మానుష్యంగా మారతాయి. అప్పటి వరకు పబ్బులు, బార్లలో గడిపిన వారు నల్లటి రోడ్లపై తాసుపాముల్లా దూసుకుపోతారు. నిషా ఎక్కిన కొందరు రేసింగ్‌లు సైతం చేస్తుంటారు. ప్రశాంతమైన రహదారులపై వాహనం ఏదైనా రంకెలేస్తూ.. పరుగులు పెట్టిస్తారు. ఆ పరుగులే కొందరి జీవితాలకు బ్రేకులు వేస్తోంది. కుటుంబాలకు తీరని శోకం మిగుల్చుతున్నాయి. ప్రమాదాలు ఎక్కవగా అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు జరుగుతున్నాయి. ఇలా గతేడాది 2,493 రోడ్డుప్రమాదాలు జరిగినట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 1,646 ప్రమాదాలు సంభవించాయి.

పబ్బులే ప్రమాదాలకు కారణమా..?

ఐటీ కారిడర్.. సంపన్న వర్గాలు నివాసం ఉండే ప్రాంతం. జూబ్లీహిల్స్, బంజారహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి ఇలా ఈ ప్రాంతాల్లో రోడ్లు విశాలంగా నల్లటి అద్దంగా మెరిసిపోతుంటాయి. ఇక్కడ పబ్బులు కూడా ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి పార్టీల సంస్కృతీ ఎక్కువే. మాంచి జోష్ తో నడిచే పార్టీల్లో మునిగితేలి.. అదే ఊపుతో ఖరీదైన కార్లలో రోడ్డెక్కుతున్నారు. తలకెక్కిన నిషాతో కార్లను 100 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూకిస్తూ.. ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ ఆ ఏరియాల్లో సంపన్న వర్గాల వాళ్లే అధిక శాతం పట్టుబడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ లను ఎత్తెయడంతో వాహనదారుల్లో భయం లేకుండా పోయింది. దీంతో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి నూరేళ్ల జీవితానికి మధ్యలోనే పులిస్టాఫ్ట్ పెట్టేస్తున్నారు. విప్రో జంక్షన్ లో జరిగిన ప్రమాదం కూడా ఇదే కోవకు చెందినదని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed