పాక్ స్టాక్ ఎక్ఛేంజ్ భవనంపై ఉగ్రవాదుల దాడి

దిశ, వెబ్ డెస్క్: కరాచీ: పాకిస్తాన్‌ కరాచీలో హై సెక్యూరిటీ నీడలో ఉండే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్లు, గన్నులతో ఈ రోజు ఉదయం విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఒక పోలీసులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, నలుగురు ఉగ్రవాదులనూ పోలీసులు మట్టుబెట్టినట్టు వివరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పలుప్రైవేట్ బ్యాంకుల హెడ్ ఆఫీసులు, ఎక్స్‌ఛేంజ్‌ కూడా ఉన్న భవనం వైపు వస్తూనే కారులోనే ఉగ్రవాదులు గ్రెనేడ్లను పట్టుకుని సిద్ధంగా ఉన్నారని, కారు దిగగానే విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారని తెలిసింది. పోలీసులు బలగాలు వెంటనే చేరుకుని ప్రజలను బిల్డింగ్ వెనుక గేటు నుంచి బయటికి తరలించారు. కార్డన్ ఆపరేషన్ నిర్వహించి నలుగురు ఉగ్రవాదులను ఎంట్రెన్స్ గేటు దగ్గర హతమార్చారు. ఓ కారులో నుంచి ఉగ్రవాదులు దిగి తుపాకులు, గ్రెనేడ్లతో దాడికి దిగారని కరాచీ పోలీస్ చీఫ్ గులాం నబీ మెమన్ తెలిపారు. నలుగురు ఉగ్రవాదులను హతమార్చామని చెప్పారు. ఈ టెర్రరిస్టుల నుంచి ఆధునిక ఆటోమేటిక్ గన్నులు, మ్యాగజైన్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ దాడికి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. వారంతా సూసైడ్ అటాకర్‌లని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ వెల్లడించారు. ఇటీవలే దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో ఓ ఉగ్రసంస్థ ఒకే రోజు మూడుపేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ సింధ్ ప్రావిన్స్‌కు రాజధాని కరాచీ. ముఠాలుగా ఏర్పడి పరస్పరం దాడులు చేసుకోవడం, ప్రజల ప్రాణాలను నష్టపరచడం కరాచీలో ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, రక్షణ దళాలు చర్యల వల్ల ఈ మధ్యకాలంలో ఈ ఘర్షణలు సద్దుమణిగాయి. తాజాగా, మళ్లీ ఈ నెలలోనే రెండుసార్లు దాడులు జరిగాయి. స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌పై దాడిని సింధ్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ తీవ్రంగా ఖండించారు. కారుకులను సజీవంగా పట్టుకుని మాస్టర్ మైండ్‌లను కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement