ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పోయిన ఆదాయాన్ని విండ్‌ఫాల్ పన్నుతో పొందనున్న కేంద్రం!

by S Gopi |
ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పోయిన ఆదాయాన్ని విండ్‌ఫాల్ పన్నుతో పొందనున్న కేంద్రం!
X

న్యూఢిల్లీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో తగ్గిన ఆదాయాన్ని విండ్‌ఫాల్ ట్యాక్స్ నుంచి సుమారు మూడోంతులు తిరిగి పొందనుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఇంధనాలపై ఎగుమతి సుంకాన్ని ఇటీవల అమలు చేసింది. దీని ప్రకారం, పెట్రోల్, విమాన ఇంధనంపై రూ. 6, లీటర్ డీజిల్‌పై రూ. 13 ఎగుమతి సుంకం అమల్లోకి వచ్చింది.

అదేవిధంగా దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 విండ్‌ఫాల్ పన్నును కేంద్రం వసూలు చేయనుంది. 2021లో దేశంలోని వివిధ చమురు కంపెనీలు 2.9 కోట్ల ముడి చమురును ఉత్పత్తి చేశాయి. దీని ద్వారా కొత్తగా వచ్చిన పన్నుల ద్వారా ప్రభుత్వం ఏడాదికి రూ. 66 వేల కోట్ల ఆదాయం అందుకోనుంది. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన తొమ్మిది నెలలకు రూ. 52 వేల కోట్ల ఆదాయం పొందుతుంది. ఇది కాకుండా ఎగుమతుల నుంచి అదనంగా ఆదాయం లభించనుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పెట్రోల్ 25 లక్షల టన్నులు, డీజిల్ 57 లక్షల టన్నులు, 7.97 లక్షల టన్నుల ఏటీఎఫ్ ఎగుమతులు నమోదయ్యాయి. దీంతో విండ్‌ఫాల్ పన్ను వల్ల ఎగుమతులు తగ్గినప్పటికీ ప్రభుత్వానికి రూ. 20 వేల కోట్ల వరకు ఆదాయం రానుంది. కాగా, ఇటీవల ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రభుత్వానికి రూ. లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. ఈ క్రమంలో తాజా పన్ను విధింపు ద్వారా ఇందులో 85 శాతం మేర తిరిగి జమకానుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story