పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన క్రీడాకారిణి.. సుశీల లిక్మాబమ్

by sudharani |
పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన క్రీడాకారిణి.. సుశీల లిక్మాబమ్
X

దిశ, ఫీచర్స్ : కామన్వెల్త్ గేమ్స్(సీజీ-2022)లో ఇండియన్ జూడోకా క్రీడాకారిణి సుశీలా దేవి లిక్మాబమ్ 48 కిలోల విభాగంలో రజత పతకాన్ని సాధించి దేశం గర్వపడేలా చేసింది. అయితే ఇంత గొప్ప విజయాన్ని ఖాతాలో వేసుకున్న సుశీల.. ఒకప్పుడు నిరాశలో కూరుకుపోయి తాను ప్రాణపదంగా ప్రేమించిన ఆటను కూడా విడిచిపెట్టాలనుకుంది. కానీ విజేతలెప్పుడూ విధికి లొంగిపోరన్న వాస్తవాన్ని నిరూపిస్తూ పునరాగమనంలో వరుస విజయాలు నమోదు చేసి సమాజానికి, తనలోని పోరాటయోధురాలికి సమాధానం చెప్పింది. పతనం నుంచి పతాక రెపరెపల వరకు జీవితంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోగా.. కెరీర్‌కు నిధులు సమకూర్చుకునేందుకు కారును సైతం అమ్ముకుంది. ఇలా ప్రతికూల పరిస్థితులతో రాజీలేని పోరాటం చేస్తున్న సుశీల.. రియల్ ఫైటర్‌గా యావత్ భారతీయుల నుంచి వందనాలు అందుకుంటోంది. ఓ గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టిన ఈ జూడో స్పోర్ట్ స్టార్ గురించి మరిన్ని విశేషాలు..

1995 ఫిబ్రవరిలో తూర్పు ఇంఫాల్‌లోని హీంగాంగ్‌లో జన్మించిన సుశీల ఐదేళ్ల ప్రాయంలోనే జూడోకా క్రీడ పట్ల ఆకర్షితురాలైంది. ఇందుకు వాళ్ల మామ దినిక్ సింగ్ కారణం కాగా, ఆయన జూడోలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి రిటైర్ అయ్యాడు. ఇంట్లో ఔత్సాహిక క్రీడాకారులకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్న క్రమంలోనే సుశీల ఆటలోని మెళకువలు నేర్చుకుంది. తన అన్నయ్య శిలాక్షి సింగ్ ప్రభావంతో కొద్దికాలం మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. సుశీల తండ్రి మణిహార్ సింగ్ తన కూతురు జూడో ఎంచుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదు కానీ ఆమె తల్లి చావోబీ దేవి మాత్రం తన కుమార్తె భారతదేశపు అగ్రశ్రేణి జూడో క్రీడాకారిణిగా ఎదగాలని, ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అనునిత్యం ఆకాంక్షించింది. అందుకే అమ్మ కోరిక వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానంటూ ప్రతీ వేదిక మీద చెప్తూ ఉంటుంది సుశీల.

లోకల్ టు నేషనల్ :

జూడోలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ఉద్దేశ్యంతో సుశీల తల్లి ఆమెను ఎనిమిదేళ్ల వయసులో ఖుమాన్ లంపాక్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)లో చేర్చింది. ప్రాక్టీస్ కోసం ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే 30 నిమిషాల దూరంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీకి సోదరుడితో కలిసి వెళ్లేది. ఇక సుశీలకు ఆటపై ఉన్న ఆసక్తి, నైపుణ్యాలు స్థానిక కోచ్‌లను ఆకట్టుకోవడంతో ఆమెను దేశంలోని అత్యుత్తమ కోచ్‌, క్రీడాకారులు ఉండే పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ తమ రాష్ట్రానికే చెందిన స్ట్పోర్ట్స్ ఐకాన్ మేరీ కోమ్‌ సహా దేశంలోని అగ్రశ్రేణి అథ్లెట్స్ ప్రాక్టీస్ చూసిన తర్వాత, అంతర్జాతీయ స్థాయిలో ఆడతానని కలలో కూడా ఊహించలేదని సుశీల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తనలోని భయాలను, ఆటలోని లోపాలను అధిగమించేందుకు సీనియర్ ప్లేయర్స్ ఎలా శిక్షణ పొందుతున్నారో, ఏవిధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో నిశితంగా గమనించడం సహా మేరీ కోమ్ ప్రాక్టీస్ సెషన్స్ పరిశీలనగా చూస్తూ ఆటతీరును మెరుగుపరుచుకునేది.

మలుపు - గెలుపు

ప్రఖ్యాత జూడో కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జీవన్ శర్మతో జట్టుకట్టడమే సుశీల కెరీర్‌లో ప్రధాన మలుపుగా చెప్పొచ్చు. ఆమెలోని అద్భుతమైన సంకల్ప శక్తి, పోరాటపటిమ, ఓటమిని అంగీకరించే మనస్తత్వాన్ని గమనించిన కోచ్ ఆటలో ఆమెను మరింత రాటుదేల్చాడు. ఆ తర్వాత ఆమె పాల్గొన్న అన్ని జాతీయ-స్థాయి మీట్స్ గెలుచుకోవడం ద్వారా 48kg విభాగంలో సుశీలకు తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలోనే గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 19ఏళ్ల వయసులో రజత పతకం గెలుచుకుని మొదటిసారి అతిపెద్ద అంతర్జాతీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత, ఆమె శిక్షణ కోసం బళ్లారిలోని JSW- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌కి వెళ్లగా, ఆ మరుసటి ఏడాది 2015లో జూనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించి మరోసారి మనదేశ కీర్తిపతాకను ఎగరేసింది.

గాయం - నిరాశ

స్యామ్ స్ట్రింగ్ టియర్ గాయం కారణంగా జకార్తాలో జరిగిన 2018 ఆసియా గేమ్స్‌లో సుశీల ఓడిపోయింది. దీంతో ఆమె తన జూడో కెరీర్ ముగిసిపోయినట్లు భావించింది. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడానికి ఆసియా క్రీడలకు అర్హత సాధించడాన్ని తన లక్ష్యంగా భావించిన ఆమె ఈ ఓటమితో నిరాశచెందింది. గాయం కారణంగా మూడు నెలల విశ్రాంతి అవసరం కాగా, కెరీర్ గురించి దిగులుచెందింది. కానీ 11ఏళ్లుగా సుశీలకు శిక్షణ ఇచ్చిన జీవన్ మాత్రం ఆమె నిరాశను దూరం చేసేందుకు గట్టిగా ప్రయత్నించాడు. 'ఏ అథ్లెట్ అయినా డిప్రెషన్‌లోకి వెళ్లవచ్చు. సుశీల కేసు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అథ్లెట్స్ అన్నీ గెలవాలనే రూల్ ఏం లేదు, కొన్ని గెలుస్తారు కొన్ని కోల్పోతారు.. కానీ ప్రతీ ఒక్కరు గెలిచేందుకే కష్టపడతారు' అంటూ ఆమెలో తిరిగి స్థైర్యాన్ని నింపాడు. దీంతో 2018, 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో వరుసగా రజత పతకాలు గెలుచుకుని పునరాగమనాన్ని ఘనంగా చాటింది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒలింపిక్స్‌కు మరిన్ని అడ్డంకులను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే పోటీ ఖర్చుల కోసం తన కారును అమ్మాల్సి వచ్చింది.

ఒలింపిక్స్ సమయంలో ఆర్థిక పోరాటం :

సుశీలలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ జూడోకాకు డబ్బు పెద్ద సమస్యగా మారింది. ఆమె తల్లిదండ్రులు రైతులు కావడంతో నేషనల్, ఇంటర్నేషనల్ టూర్స్‌కు వెళ్లేందుకు కావాల్సిన ప్రయాణ ఖర్చుల కోసం ఇప్పటికే ఎన్నో అప్పులు చేశారు. ఏదేమైనప్పటికీ, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినంత మాత్రాన విజయం చేకూరదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో మాత్రమే పోటీపడితే సరిపోదు. ఏడాది పొడవునా గ్రాండ్స్ ప్రిక్స్, గ్రాండ్ స్లామ్‌ వంటి అనేక టోర్నమెంట్స్‌లో 20-30 బేస్‌లలో పోటీపడాలి. అంతేకాదు జూడో సమాఖ్య నిబంధన ప్రకారం ఇతర ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు ప్రయాణ ఖర్చులను తామే భరించాల్సి ఉంటుంది. నిజానికి జూడోకు ఎక్కువ మంది స్పాన్సర్లు లేరు. ఎందుకంటే మేము ఎప్పుడూ ఒలింపిక్ పతకాన్ని గెలవలేదు. ఒక్కో పర్యటనకు కనీసం రూ. 50,000 ఖర్చు అవుతుంది. ఏదేమైనా ఎనిమిదేళ్లలో సీజీలో రెండో రజత పతకాన్ని సాధించి, ఏళ్ల తరబడి తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కించుకుంది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఆమెకు చాలా ప్రశంసలు, కీర్తిని సంపాదించిపెట్టింది. కానీ ఆమె ఈ ఘనతను సాధించేందుకు, ఈ స్థాయికి చేరుకునేందుకు నిత్యం అనేక అడ్డంకులను అధిగమించింది.

- కోచ్ జీవన్ శర్మ

Advertisement

Next Story