మెట్రో రైలు​ కోసం మరో ఉద్యమం.. నడుంబిగించిన మాజీ ఎమ్మెల్యే

by Javid Pasha |
మెట్రో రైలు​ కోసం మరో ఉద్యమం.. నడుంబిగించిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అధికార టీఆర్​ఎస్​ పార్టీలో కొనసాగుతున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పటాన్​చెరుకు చెందిన సత్యనారాయణ(సత్తన్న) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించి మెట్రో రైల్​లైన్​ సాధించడానికి నడుంకట్టారు. రెండో ఫేజ్​లో పటాన్​చెరు వరకు మెట్రో పొడిగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాటే మరచిపోయిందని విమర్శించారు. నిత్యం లక్షలాది మంది పటాన్‌చెరు ప్రాంతం నుంచి ప్రయాణాలు సాగిస్తున్నారని, ఈ క్రమంలో మెట్రో లైన్​ పటాన్​చెరు మీదుగా సంగారెడ్డి వరకు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

భేల్, బీడీఎల్, ఓడిఎఫ్, గీతం యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక ఐఐటీ, పారిశ్రామిక వాడలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇందుకోసం ఆయన నేతృత్వంలో మెట్రో సాధన సమితిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన పటాన్​చెరులో మీడియాతో మాట్లాడారు. మెట్రో లైన్​ పొడిగింపు విషయంలో కేంద్రం 10 శాతం నిధులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇవ్వాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి లైన్​ సాధిస్తామని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. సీఎం మొదలుకుని, ఎంపీ, ఎమ్మెల్యే అందరిని కలిసి స్థానిక ప్రజల ప్రయాణ ఇబ్బందులను వివరిస్తామని వివరించారు.


రాష్ట్రంలోని నాయకులకు, అధికారులకు ఏ మాత్రం అవగాహన లేకపోవడంతోనే మెట్రో లైన్​ను మియాపూర్​ వద్ద ముగించారని విమర్శించారు. అటవీ ప్రాంతంలా ఉండే అక్కడ కాకుండా చందానగర్​ లేదా లింగంపల్లి వద్ద ముగించాల్సి ఉండేదన్నారు. 20 ఏండ్ల క్రితం మెట్రో పనులు మొదలయ్యాయి. రెండో విడతలో పటాన్​చెరు వరకు లైన్​ వస్తుందని హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని మరచిపోయారని విమర్శించారు. పాలక వర్గాలు, అవగాహన లేని నాయకులు ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని పరోక్షంగా ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

ఒకరిని ఒకరు తిట్టుకోవడం, దుమ్మెత్తి పోసుకోవడం ఇప్పటి రాజకీయంలో ప్యాషన్​ అయ్యిందని, టీవీల్లో తిట్ల దండకాలు చూసి జనం తిట్టుకుంటున్నారన్నారు. తిట్టుకుంటూ మజా చేసుకుంటున్నారు తప్ప, ప్రజా సమస్యలపై సీరియస్​ నెస్​ చూపించడం లేదని సత్యనారాయణ విమర్శించారు. ఎవరినీ వదిలిపెట్టబోమని, మెట్రో లైన్​ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా టీఆర్​ఎస్​ పార్టీలో ఉన్న సత్యనారాయణ మెట్రో సాధన ఉద్యమంపై సర్వత్రా చర్చ మొదలైంది.

ఆ పార్టీకి చెందిన ఎవరు కూడా సమావేశం వద్ద కనిపించలేదు. ఆయన కూడా పలు సందర్భాల్లో మీడియా ముందు ప్రభుత్వంపై కూడా సూటిగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో 'సత్తన్న' ఉద్యమం చర్చానీయాంశంగా మారింది. ఈ సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన నాయకులు, మేధావులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed