TRS మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ నేతల ఝలక్!

by GSrikanth |   ( Updated:2022-03-31 03:51:51.0  )
TRS మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ నేతల ఝలక్!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీలోనే కుంపటి రాజుకుంటుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి తీరుపై గుస్సాతో ఉన్నట్లు సమాచారం. నిన్న, మొన్నటి వరకు సఖ్యతతో ఉన్న ఎమ్మెల్యేలు సైతం మంత్రి వ్యవహార శైలితో నారాజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన కూకట్‌పల్లిలో నూతనంగా నిర్మించిన మోడ్రన్ రైతు బజార్ ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు ఎడమొహం-పెడ మొహం అన్నట్లుగానే కన్పించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో, పేపర్ ప్రకటనలలోనూ జిల్లా మంత్రి ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి, మంత్రి మల్లారెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా, తాజాగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మంత్రిని దూరం పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రి మల్లన్న తీరుపై ఎమ్మెల్యేలు గుర్రు!

టీఆర్‌ఎస్‌ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితుల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మల్లారెడ్డి గెలుపొందారు. దీంతోపాటు మల్లారెడ్డికి అనుహ్యంగా మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన మల్లారెడ్డికి మంత్రి పదవి దక్కడం జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేదట. దీంతో మంత్రి మల్లన్నపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్రుగా ఉన్నారు. అయితే, ఆ తర్వాత 2019 సాధారణ ఎన్నికలలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలో నిలిచాడు. జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ ఆదేశాల మేరకు మర్రి గెలుపుకోసం శ్రమించారు. అయితే, స్వల్ప ఓట్లతో రాజశేఖర్ రెడ్డి పరాభావం పాలయ్యాడు. జిల్లాలో అప్పట్లో మల్లారెడ్డితో కలిసి ముందుకు సాగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. మన మల్లన్నే కదా అని చనువుగా ఉంటే.. మొదటికే మోసం వస్తుందని జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రచ్చ రచ్చగా మారుతోంది.

మంత్రి తలదూరుస్తున్నారా..?

జిల్లా మంత్రి అయిన మల్లారెడ్డి మిగతా ఎమ్మెల్యేలతో సమన్వయం లేకుండా ముందుకు సాగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా.. కనీసం సమాచారం ఇవ్వకుండా ఆయా నియోజకవర్గాల నేతలతో మంత్రి మల్లారెడ్డి నేరుగా మాట్లాడుతూ.. వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో మల్లారెడ్డి వ్యవహార శైలిపై కొందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నారాజ్‌గా ఉన్నారని అంటున్నారు. సరదాగా షేర్ చేసే విషయాలను.. బయటకు చెప్పకూడని అంశాలను మల్లారెడ్డి బహిర్గతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదే ఒక తలనొప్పి అనుకుంటే.. నేరుగా తమ నియోజకవర్గాల్లో మంత్రి తలదూరుస్తున్నారని ఆగ్రహంతో పలువురు ఎమ్మెల్యేలు ఊగిపోతున్నారు.

మంత్రి హడావిడి..

ఇక నియోజకవర్గాల్లో శంకుస్థాపనులు.. ప్రారంభోత్సవాలకు పిలిస్తే.. సమయం కేటాయించే విషయంలో మంత్రి ఏ మాత్రం స్థానిక ఎమ్మెల్యేలకు సహకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్‌ ఎమ్మెల్యే శేరి సుభాష్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ నియోజకవర్గాల్లో మంత్రి తీరుపై విమర్శలు వస్తున్నాయి. వీరే కాకుండా.. ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు, సురభి వాణిదేవి, కాటేపల్లి జనార్దన్ రెడ్డిలు సైతం మల్లన్నతో ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన ఏ ఇద్దరు కలిసినా ఈ రగడపైనే చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం అని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసినా మంత్రి మల్లన్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకే మంత్రిని ఎలా కట్టడి చేయాలి? వదిలేస్తే మొదటికే మోసం వస్తుందేమో అని శాసనసభ్యులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది.

తీరు మార్చుకోవాలని మంత్రికి సంకేతాలు పంపారా?

ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో ఉంది. అందుకే మీరు తీరు మార్చుకోకపోతే ఇబ్బందే.. కాస్త దృష్టిలో పెట్టుకోండి అని ఇన్‌డైరెక్ట్‌గా ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డికి సంకేతాలు పంపినట్లు తెలిసింది. మంత్రి మల్లన్న తీరుమార్చుకుంటారా? ఎమ్మెల్యేలతో అడ్జెస్ట్‌ అవుతారా? మునుపటిలా సయోధ్య సాధ్యమేనా అన్నది ఆసక్తిగా మారింది. పార్టీ పెద్దలు కూడా ఇక్కడి వ్యవహారాలపై ఓ కన్నేసినట్టు చెబుతున్నారు. మరి.. విభేదాలు ముదురు పాకాన పడకుండా పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed