క్లైమేట్ చేంజెస్‌ పరిశీలనకు అతి చిన్న ఉపగ్రహం.. రూపొందించిన శాస్త్రవేత్తలు!

by S Gopi |   ( Updated:2022-07-06 11:16:07.0  )
క్లైమేట్  చేంజెస్‌ పరిశీలనకు అతి చిన్న ఉపగ్రహం.. రూపొందించిన శాస్త్రవేత్తలు!
X

దిశ, ఫీచర్స్ : 'టోటల్ సోలార్ ఇరేడియన్స్(TSI)' లేదా సూర్యుడి నుంచి భూమికి వెలువడే శక్తిని కొలిచేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 'కాంపాక్ట్ టోటల్ ఇరేడియన్స్ మానిటర్(CTIM)'గా పిలవబడే షూబాక్స్-సైజ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతోంది. సదరు శక్తి భూమిపై వాతావరణ మార్పులు, ఇతర ప్రపంచ శక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకునేందుకు ఈ ఉపగ్రహం శాస్త్రవేత్తలకు సాయపడనుంది.

'ఎర్త్ రేడియేషన్ బడ్జెట్‌'లో TSI అనేది ప్రధాన భాగం. ఇది ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ సోలార్ పవర్ మధ్య ఓవర్ బ్యాలన్స్‌ను వివరిస్తుంది. పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయువులు.. వాతావరణంలో పెరుగుతున్న సౌరశక్తిని బంధిస్తాయి. ఈ పెరుగుదలే సముద్ర మట్టాలు పెరిగేందుకు తద్వారా తీవ్రమైన వాతావరణ పరస్థితులకు కారణమవుతుంది. ఈ మార్పులకు సౌరశక్తిని కారణంగా భావిస్తున్న పరిశోధకులు.. ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ ప్రయోగం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌లో గ్రీన్‌హౌస్ వాయువుల పాత్రను అర్థం చేసుకోగలరు. సౌర చక్రంలో భూమి పొందే సౌర వికిరణం(సోలార్ రేడియేషన్) మొత్తంలో చిన్న చిన్న హెచ్చుతగ్గులను గుర్తించగలరు.

నాసాకు చెందిన NOAA(నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) పరిశోధకులు.. 2005 -2019 కాలంలో భూవాతావరణంలో మిగిలిఉన్న సౌర వికిరణం దాదాపు రెండింతలు పెరిగిందని నిర్ధారించేందుకు ఈ రికార్డును ఉపయోగించారు. అయితే ఈ కొలతలను అంతరాయాలు లేకుండా సేకరించవచ్చని నిర్ధారించేందుకు సమర్థవంతంగా పనిచేసే పరికరాలు కావాలి. కానీ అవి ఖర్చుతో కూడుకున్నవి కాగా CTIMను మాత్రం తక్కువ బడ్జెట్‌ డివైజ్‌గా చెప్పొచ్చు.

ఉపగ్రహ పరిమాణాన్ని తగ్గించడం వల్ల దాన్ని తక్కువ-భూమి కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు అయ్యే ఖర్చు, సంక్లిష్టత తగ్గుతుంది. CTIM ఓ బోలోమీటర్(రేడియేషన్ డిటెక్టర్)ని కలిగి ఉంది. సిలికాన్ పొరపై నిలువుగా అమర్చిన చిన్న కార్బన్ నానో ట్యూబ్స్‌తో తయారు చేసిన ఈ మెటీరియల్.. ఇన్‌కమింగ్ లైట్‌లో 99.995% గ్రహిస్తుంది. అంటే CTIMలోని రెండు బోలోమీటర్లు కలిసి రూపాయి నాణెం కంటే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇక చిన్న క్యూబ్‌శాట్ ప్లాట్‌ఫామ్ నుంచి TSI డేటాను సేకరించేందుకు కాంపాక్ట్ స్పెక్ట్రల్ ఇరేడియన్స్ మానిటర్(CSIM)అనే పరికరాన్ని పరిశోధకులు రూపొందించారు. సూర్యకాంతిలో ఉన్న కాంతి బాండ్లలో వైవిధ్యాన్ని అన్వేషించేందుకు అదే బోలోమీటర్స్‌ను ఉపయోగించింది. భవిష్యత్తులో, CTIM, CSIMలను సౌర వికిరణాన్ని కొలవగల, విడదీయగల ఒక కాంపాక్ట్ సాధనంగా విలీనం చేయాలని నాసా భావిస్తోంది.

Advertisement

Next Story