- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోరాడారు.. కదిలించారు.. ఫలించిన గిరిజనుల ఉద్యమం

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అదో మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామం పెంబి మండలం లోని చాకిరేవు. మనిషి బతికేందుకు కావాల్సిన కనీస వసతులు లేవు.. నీళ్లు రావు.. కరెంటు లేదు.. రోడ్డు వేయలేదు.. నిర్మల్ జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చిన.. రోజులు గడిచినా సమస్యలు తీర్చలేదు.. స్థానిక ఖానాపూర్ ఎమ్మెల్యే అసలే పట్టించుకోవడం లేదు.. తమ గోడును పట్టించుకునే దిక్కు లేక పోవటంతో ఆదివాసీ గిరిజనులు పోరుబాట పట్టారు.. పిల్లా పాపలతో ముఠాముల్లెతో సుమారు 75 కి.మీ పాదయాత్రగా వచ్చి కలెక్టరును కలిసేందుకు వచ్చారు.
చంటి పిల్లలు, మహిళలు సైతం కదిలిరాగా.. కలెక్టర్ కలవకపోవడం తో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. కలెక్టరేట్ వద్ద రెండు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇక్కడే బైఠాయించారు. రోడ్డు పక్కనే వంటా వార్పు చేసుకుని తింటున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఇంటికి, ఊరికి తిరిగి వెళ్లేది లేదని కూర్చున్నారు. ఊరి నుంచి కాలినడకన వచ్చిన వారు రెండు రోజులుగా కలెక్టరేట్ ముందు రోడ్డు పక్కన టెంటు కిందనే బైఠాయించారు. దీంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు బుధవారం రోజున పెంబి మండలం చాకిరేవు గ్రామాన్ని సందర్శించారు. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలోనూ అంతా ఈ గ్రామం, గ్రామస్తుల గురించి చర్చించుకుంటున్నారు. ప్రతి తండా, పల్లెకు మిషన్ భగీరథ నీరు ఇచ్చాకే ఎన్నికల్లో ఓట్లకు వెళ్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇలాంటి పల్లెలకు ఇప్పటికీ చెలిమెల నీరే దిక్కు అనేది అటు అధికారులు, ఇటు పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. కిలోమీటరు దూరం వెళ్లి చెలిమల నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది. పెంబి నుంచి నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఉండగా.. మధ్యలో వాగుపై వంతెన లేదు. వాగు దాటాక 10 కీ.మి. ఊరికి రోడ్డు లేదు. మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేశామని గొప్పలు చెప్పే వారు ఈ వాస్తవాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామని..ప్రతి పల్లెకు కరెంటు వెలుగులు అంటున్న వారు.. ఇలాంటి పల్లెలకు కందిలి, దీపం వెలుగులే దిక్కైన వాస్తవ సత్యాన్ని తెలుసుకోవాలి.
సమస్యలు ఇన్ని ఉన్నా.. ఏళ్లు, దశాబ్దాలుగా వీటితో సహ జీవనం చేస్తున్నారు.. అధికారులకు చెప్పి అలసి పోయారు. వినతి పత్రాలు ఇచ్చి విసిగిపోయారు. చివరికి పోరుబాట పట్టారు. పాదయాత్రగా కదిలారు. పిల్లాజెల్లా తో కలిసి పల్లె నుంచి దండు కట్టారు. కలెక్టరేట్ వద్ద మకాం వేశారు. సమస్యలు తీర్చే వరకు కదిలేది లేదని.. బైఠాయించారు. రోడ్డుపైనే వంటావార్పు చేసుకుని. రాత్రి అక్కడే బస చేసి. రోజంతా టెంటు కింద బైఠాయించారు. కదిలేది లేదని.. ఉద్యమించిన ఆదివాసీ గిరిజనులు.. అధికారులను కదిలించారు. ఫలితంగా జిల్లా కలెక్టర్ తో పాటు అధికారుల బృందం కలెక్టరేట్ నుంచి చాకిరేవుకు కదిలించారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన గ్రామాల దుస్థితి. పోరాడితే గానీ పరిష్కారం దొరకదాయే.. ఇలాంటి పల్లెలు, తండాలు, గూడెంలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇక వారు పోరుబాట పట్టాల్సిందే. తమ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందే.