ధరల అదుపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: పీసీసీ చీఫ్ శైలజానాథ్

by Vinod kumar |
ధరల అదుపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: పీసీసీ చీఫ్ శైలజానాథ్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. లెనిన్ సెంటర్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. ఇద్దరు నేతలు కలిసే నిత్యావసర ధరలపై డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మోడీ ఆదేశాలతోనే జగన్ పన్నులు, విద్యుత్ చార్జీలు పెంచారని ధ్వజమెత్తారు.

ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ.. ప్రజలపైనే మోయలేని భారాలు మోపుతున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. పెట్రోల్‌పై పన్నులు, విద్యుత్ చార్జీలను ఇప్పటికైనా తగ్గించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. మోడీ, జగన్‌లు ఆడే జగన్నాటకాలను ప్రజలకు వివరిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌, విద్యుత్ చార్జీలతోపాటు నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ.. వారం రోజుల పాటు ఉద్యమం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాయలో ఉన్న జగన్ కళ్లు తెరవాలని లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని పీసీసీ చీఫ్ శైలజానాథ్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed