పేరుకే ఉత్తమ గ్రామపంచాయతీ.. వెలవెలబోతున్న పారిశుద్ధ్యం..

by Manoj |
పేరుకే ఉత్తమ గ్రామపంచాయతీ.. వెలవెలబోతున్న పారిశుద్ధ్యం..
X

దిశ, వైరా : నాడు ఉత్తమ గ్రామ పంచాయతీగా రెండుసార్లు ఎన్నికైన ఆ గ్రామంలో నేడు పచ్చదనం పరిశుభ్రత లేక వెలవెలబోతోంది. కొణిజర్ల మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తనికెళ్ల గ్రామ పంచాయతీలో తనికెళ్ల నుండి తుమ్మలపల్లి వైపు వెళ్లే రహదారికి ఇరువైపులా అలాగే తనికెళ్ళ నుండి ఖమ్మం వైపు అలాగే తనికెళ్ళ నుండి వైరా వైపు వెళ్లే రహదారికి ఇరువైపులా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున లక్షలాది రూపాయల ఖర్చుతో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా కొంత గ్రామ పంచాయతీ నిధులతో మరికొంత కలిపి లక్షలాది రూపాయల ఖర్చుతో పల్లెల్లో పచ్చదనం పర్యావరణం వెల్లివిరియాలని ఉద్దేశంతో మొక్కలు నాటారు. నేటికీ మన కంటికి చూద్దామన్న కనిపించని వైనంగా మారాయి. మొక్కలు నాటి వాటి రక్షణ కోసం ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి మొక్కలను రక్షించాల్సిన బాధ్యత సర్పంచులు, గ్రామ సెక్రటరీ పైన ఉన్న పట్టించుకునే వారే లేరనే విధంగా నీరు లేక ఎండిపోయిన చెట్లు ఒకవైపు, నేల వాలిన చెట్లు మరోవైపు అసలు చెట్లే లేకుండా ఖాళీ గుంతలు దర్శనమిస్తున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు అలాగే గ్రామ పంచాయతీ నిధులు సుమారు ఏడు లక్షల రూపాయల వరకు వెచ్చించి వేసిన మొక్కలు వెక్కిరిస్తున్నాయని గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత సరిగా లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


సుమారు రూ.12 లక్షల ఖర్చుతో తనికెళ్ళ గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం అధికారికంగా ప్రారంభం కాకముందే శిథిలావస్థకు వచ్చిందని, రేకుల షెడ్ లో తలుపులు పగిలిపోయి వైకుంఠధామం లో మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి అద్వానంగా తయారైందని గ్రామస్థులు వాపోతున్నారు. వైకుంఠధామం పరిసర ప్రాంతాల్లో వేసిన మొక్కలు అన్ని నేల వాలి పోయి మొక్కలకు రక్షణగా వేసిన ట్రీ గాడ్‌లు చిందరవందరగా పడేసిన దృశ్యాలు వైకుంఠ దామంలో కనిపిస్తున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ముందు పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెండు సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకున్న గ్రామం ఇలా అయితే ఎలా అని కొందరు ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు.



Advertisement

Next Story