ఈ నెల 7న 'సూపర్ యాప్' ను ప్రారంభించనున్న టాటా గ్రూప్!

by Mahesh |
ఈ నెల 7న సూపర్ యాప్ ను ప్రారంభించనున్న టాటా గ్రూప్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సూపర్ యాప్ 'న్యూ' ను ఈ నెల 7న ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 'న్యూ' సూపర్ యాప్ ద్వారా టాటా గ్రూప్ డిజిటల్ సేవలు, కంపెనీకి చెందిన అన్ని యాప్‌లను ఒకే ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురానుంది. ప్రత్యేకమైన ఆఫర్‌లు, ప్రయోజనాలు, సేవలతో 'టాటా న్యూ' ద్వారా వినియోగదారులు కొత్త అనుభూతిని పొందనున్నారు. ఎలాంటి ఇబ్బంది లేని షాపింగ్, చెల్లింపుల సేవలను సరికొత్త వన్-స్టాప్-షాప్ 'న్యూ' అందిస్తుందని కంపెనీ వివరించింది. ఇప్పటికే సంస్థ తమ ఉద్యోగులతో న్యూ యాప్‌ను పరీక్షించినట్టు పేర్కొంది. కిరాణా సామాగ్రి నుంచి గాడ్జెట్ల వరకు 'టాటా న్యూ' లో లభిస్తాయి. అలాగే, 'టాటా పే'ని ఉపయోగించి ఆన్‌లైన్, స్టోర్లలో కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లులు సహా ఇతర చెల్లింపులను సులభంగా పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా వినియోగదారులకు షాపింగ్ చేసిన ప్రతిసారి రివార్డులు అందుతాయని, హోటల్, విమాన టికెట్లు, ఇంకా ఇతర సేవలకు కూడా రివార్డులు లభించనున్నాయని టాటా సంస్థ తెలిపింది.

ఇప్పటికే అమెజాన్, పేటీఎం, రిలయన్స్ జియో కంపెనీలు తమ సూపర్ యాప్‌లను తీసుకొచ్చాయి. ఇవి చెల్లింపులు, కంటెంట్ స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్ బుకింగ్, కిరాణా సామాగ్రి లాంటి అనేక సేవలను అందిస్తున్నాయి. త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో మార్ట్ కూడా అందరికీ అందుబాటులోకి రానుంది. దేశంలోని వినియోగదారుల డిజిటల్ ఎకానమిలో మెరుగైన వృద్ధిని కొనసాగిస్తున్న అమెజాన్, జియో ప్లాట్‌ఫామ్‌లకు టాటా వారి కొత్త ప్లాట్‌ఫామ్ గట్టి పోటీనివ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ప్రకారం.. భారత వినియోగదారుల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఏకంగా రూ. 60 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఇది రూ. 7 లక్షల కోట్లుగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed