ఈసీ అనుమతి లేకుండా పార్ట్ టైం నోటిఫికేషన్లు..?

by Javid Pasha |
ఈసీ అనుమతి లేకుండా పార్ట్ టైం నోటిఫికేషన్లు..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 15న విడుదల చేసిన టెంపరరీ పార్ట్ టైం లెక్చరర్ల నోటిఫికేషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో చేపట్టిన నియామకాలు చెల్లవని, అక్రమాలు జరిగాయని నానా గొడవ చేసి యూనివర్సిటీని అల్లరి పాలు చేసిన ఉదంతాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. యూనివర్సిటీ పాలక మండలి అనుమతి లేకుండానే పార్ట్ టైం లెక్చరర్ల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో విమర్శలు వస్తున్నాయి. 2021లో వర్క్ లోడ్ లేదని ఫిజిక్స్, ఎడ్యుకేషన్ విభాగాల్లో గతంలో నియమించిన 8 మందిని తొలగించారు. ఎందుకంటే వారికి పని లేదు కాబట్టి, అవసరం లేదని నియామకాలను చేసిన వాటిని తొలగించారు.

గత ఏడాది 7 డిపార్ట్ మెంట్‌లలో 9 పార్ట్ టైం లెక్చరర్ల పోస్టుల భర్తీ కోసం హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఏం జరిగి ఉంటుందని యూనివర్సిటీలో చర్చ జరుగుతుంది. యూనివర్సిటీలో యాజమాన్యం అనుమతి లేకుండానే నోటిఫికేషన్ ఇచ్చి, రాత పరీక్షలు నిర్వహించి, వారికి ఇంటర్వ్యూలు చేసి, ఏ ప్రాతిపదికన నియామకాలు చేశారోనని విమర్శలు వస్తున్నాయి. నియామకాల్లో ఢీన్ చైర్మన్ గా, ఎక్స్ టర్నల్ (ఇతర యూనివర్సిటీకి చెందిన సీనియర్ సబ్జెక్టు ఎక్స్ పర్ట్), సంబంధిత డిపార్ట్‌మెంట్ హెడ్, కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ ప్రొఫెసర్ల సమక్షంలో జరగాల్సిన ఇంటర్వ్యూలు గుట్టుగా వారు లేకుండా ఎలా జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఇంటర్వ్యూ లకు పిలిచిన అభ్యర్థులకు ఆరోజు ఇంటర్వ్యూ ఉందని తెలియదని, చివరి నిమిషంలో ఫోన్‌లో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని అధికారులే చెప్పలేకపోతున్నారు. దానికి తోడు అసలు తరగతులు జరుగని లా డిపార్ట్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్ విభాగాల్లో పోస్టుల భర్తీకి 2021లో వర్క్‌లోడ్ లేదని చెప్పిన యూనివర్సిటీ అధికారులు ఎందుకు ప్లేట్ ఫిరాయించి అక్కడ పోస్టులను భర్తీ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్క్‌లోడ్ లేదని 2021లో 8 మంది పార్ట్ టైం లెక్చరర్లను తొలగించారు. కానీ అందులో ఐదుగురు ఇప్పటికీ విధులకు హాజరవుతున్నారు.

వారిచేత తరగతులు నిర్వహించి.. విద్యార్థులకు బోధన చేయకుండానే ప్రతి నెల వేతనం ఇవ్వడంపై విమర్శలు ఉన్నాయి. ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ముగ్గురు, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్‌లో ఇద్దరు వర్క్‌లోడ్ లేదని ప్రతి నెల వేతనం మాత్రం తీసుకుంటున్నారు. విశేషమేమిటంటే వారు కూడా తమకు వర్క్‌లోడ్ చూపెట్టాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోకుండా అవసరం లేని డిపార్ట్‌మెంట్‌లను నియామకాలు ఎలా చేశారని టీచర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ లోడ్ లేదని గత ఏడాది 113 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, పార్ట్ టైం లెక్చరర్ల భర్తీని అడ్డుకున్న పాలకవర్గం అనుమతి ఇవ్వకపోయినా యూనివర్సిటీ అధికారులు ఎలా నోటిఫికేషన్ ఇచ్చారని చర్చ జరుగుతుంది.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, కుల సమీకరణలు జరుగుతాయని యూనివర్సిటీలో గందరగోళం రేపే విద్యార్థి సంఘాలు మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యమేమిటనే చర్చ జరుగుతుంది. పార్ట్ టైం లెక్చరర్ల నియామకాల్లో ప్రస్తుతం విద్యార్థి నేతలుగా ఉన్న పూర్వ విద్యార్థులే పోస్టింగ్‌ల కోసం ప్రయత్నిస్తుండటమే వారి సైలెంట్‌కు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు విద్యార్థి సంఘాల నేతలు తమ స్వార్థం కోసం ఆశ్రిత పక్షపాతంగా రాత్రికి రాత్రే పార్ట్ టైం లెక్చరర్లుగా విధుల్లో చేరేందుకు యూజీసీ, యూనివర్సిటీ నియమ నిబంధనలకు పాతర వేశారని, వారికి పాలకవర్గంతో పాటు అధికారుల అండ ఉందని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జరిగిన పాలకవర్గం సమావేశం వాయిదా పడుతూ వస్తుందని, ఈ నెల 2వ వారంలో జరుగుతుందని అందులో పార్ట్ టైం లెక్చరర్ల భర్తీ అంశాన్ని లేవనెత్తేందుకు మరికొన్ని విద్యార్థి సంఘాలు సిద్దమవుతున్నారు. రాత పరీక్ష రాసి కనీసం ఇంటర్వ్యూ కాల్ రాని మరికొందరు నిరుద్యోగులు కూడా ఉన్నత విద్యా కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story