మూడో రోజూ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

by Harish |
మూడో రోజూ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో నష్టపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో హెచ్చు తగ్గులు ఉండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నెల రోజులు ముగిసినా శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం వంటి పరిణామాలు సూచీలను దెబ్బతీశాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూలతకు తోడు దేశీయంగా ద్రవ్యోల్బణ ఆందోళనల వల్లనే స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను ఎదుర్కోవడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భారత రూపాయి విలువ క్షీణించడం, భారత్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 233.48 పాయింట్లు పడిపోయి 57,362 వద్ద, నిఫ్టీ 69.75 పాయింట్లు క్షీణించి 17,153 వద్ద ముగిశాయి. నిఫ్టీలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ రంగాలు 1 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీస్, ఏషియన్ పెయింట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టైటాన్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, విప్రో, ఎల్అండ్‌టీ, నెస్లె ఇండియా, టీసీఎస్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.21 వద్ద ఉంది.

Advertisement

Next Story