బాలికలు చదువుతో పాటు వాటిపై అవగాహన పెంచుకోవాలి

by Vinod kumar |
బాలికలు చదువుతో పాటు వాటిపై అవగాహన పెంచుకోవాలి
X

దిశ, ఖమ్మం: నేటి సమాజంలో బాలికలు చదువుతో పాటు చట్టాలు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం పోలేపల్లి లోని వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ లో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కోర్టులు ఉన్నాయన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉచితంగా న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని, చట్టంలో పురుషులు, మహిళలకు సమాన హక్కులు కలిగి ఉన్నాయన్నారు.


రాజ్యాంగం కొన్ని సమయాల్లో స్త్రీలకు ప్రత్యేక హక్కులు కల్పించిందన్నారు. గర్భస్త లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఉందని, ఈ చట్టం ప్రకారం స్కానింగ్ సెంటర్ లు కడుపులో ఉన్న బిడ్డ ఆడ లేదా మగ అని బహిర్గతం చేయకూడదని ఇది చట్ట విరుద్ధం అన్నారు. కుటుంబ బంధంలో స్త్రీ గొప్పతనాన్ని వివరించారు. వివాహ వయస్సు, గృహ హింస చట్టం, న్యాయ సేవలు ఎలా పొందాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు మహిళలు సమాజంలో ఎదురయ్యే ఘటనలు వాటిని న్యాయ సేవలు పొందటం పై వివరించారు.


గర్భస్త పరీక్షలు, లింగ నిర్ధారణపై కటిన చట్టాలు ఉన్నాయని అవగాహన కల్పించారు. 18 ఏళ్ల లోపు బాలికల లైంగిక వేధింపులపై వివరించారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర వివరించారు. ఈ కార్యక్రమంలో బోనాల రామకృష్ణ, న్యాయవాదులు పద్మావతి, ఇమ్మడి లక్ష్మీనారాయణ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story