మర్రిగూడ ఎమ్మార్వో ఆఫీసులో ఉద్రిక్తత.. రోడ్డెక్కిన 16 గ్రామాల సర్పంచ్‌లు

by Manoj |
మర్రిగూడ ఎమ్మార్వో ఆఫీసులో ఉద్రిక్తత.. రోడ్డెక్కిన 16 గ్రామాల సర్పంచ్‌లు
X

దిశ, మర్రిగూడ: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీపై మర్రిగూడలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే పంపిణీ చేయాల్సిన చెక్కులను తహసీల్దార్ మాజీ ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేయడంపై మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని 16 గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. మొత్తం మండలంలో 20 గ్రామాలు ఉండగా, అందులో 16 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు ఉన్నారు.

అయితే, ఇటీవల మండల వ్యాప్తంగా 103 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి తహసీల్దార్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాక పాండు మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేయాల్సిన చెక్కులను, తహసీల్దార్ మాజీ ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేయడాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు. నిబంధనలు తుంగలో తొక్కిన తహసీల్దార్ పుష్పలత‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి, ఎరుగండ్లపల్లీ ,ఆజిల్లా పురం ,శివన్నగూడెం సారంపేట ,మే టి చందాపురం ,నామా పురం, అంతంపేట ,లెంకలపల్లి ,దామెర భీమనపల్లి ,వెంకేపల్లి గ్రామాల సర్పంచులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story