75 ఏళ్ల స్వాతంత్రం త‌ర్వాత‌ ఈ గ్రామానికి క‌రెంటు ఇప్పుడొచ్చింది!

by Sumithra |   ( Updated:2022-05-04 10:15:43.0  )
75 ఏళ్ల స్వాతంత్రం త‌ర్వాత‌ ఈ గ్రామానికి క‌రెంటు ఇప్పుడొచ్చింది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః క‌రెంటు లేని రాత్రుళ్ల‌ను మ‌నం ఎన్ని రోజులు అనుభ‌వించి ఉంటాము? ముఖ్యంగా 1990ల త‌ర్వాత ప‌ట్ట‌ణాల్లో పుట్టిన‌వారైతే ఊహించుకోడానికి కూడా అంత‌గా జ్ఞాప‌కం రాదు. అయితే, ఇదే భార‌త‌దేశంలో నాగ‌రికంగా బతుకుతున్న ఎంతో మంది ఇప్ప‌టికీ విద్యుత్ సౌక‌ర్యం లేకుండా జీవిస్తున్నారు. అందులో ఈ గ్రామం కూడా ఒక‌టి. 75 సంవత్సరాల స్వ‌తంత్ర భార‌త‌దేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్‌లోని సద్దల్ అనే గ్రామం 2022 ఏప్రిల్ 6న క‌రెంటును చూడ‌గ‌లిగింది. కేంద్ర ప్రభుత్వ 'అన్‌టైడ్ గ్రాంట్స్ స్కీమ్' కింద బుధవారం మొదటిసారిగా గ్రామ‌స్థులు విద్యుత్‌ను పొందడంతో ఆ గ్రామం చీక‌ట్ల నుండి విముక్తి పొందింది. ఇళ్లకు విద్యుత్ రావ‌డంతో గ్రామ‌స్థులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు దొర‌క‌బోతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకుముందు, గ్రామంలో సాయంత్రం అయ్యిదంటే వెలుగు కోసం వారికున్న ఏకైక ఆధారం కొవ్వొత్తులు, నూనె దీపాలు. ఆ చీక‌టి వారి రోజువారీ జీవితంలో భాగమైంది. సరైన విద్యుత్‌ అందించాలన్న తమ చిరకాల డిమాండ్‌ ఎట్టకేలకు ఇప్పుడు నెరవేరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా విజ‌య‌వంతం కావ‌డానికి కార‌ణం ఇటీవల జమ్మూ, కాశ్మీర్‌లో అమలు చేసిన పంచాయతీ రాజ్ చట్టంలోని మూడు అంచెల వ్యవస్థే అంటున్నారు గ్రామ‌స్థులు. "మునుపటి తరాలు ఈ అద్భుతాన్ని చూడలేకపోయాయి. ఇంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాకు విద్యుత్‌ను అందించిన శాఖకు ఈ రోజు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము" అని సీనియ‌ర్ సిటిజ‌న్‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన 25KVA ట్రాన్స్‌ఫార్మర్ వ‌ల్ల‌ దాదాపు 25 ఇళ్లకు ప్రయోజనం చేకూరిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది జిల్లాలో విద్యుత్ శాఖ సాధించిన చారిత్రాత్మక ఘనత అని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed