రైతుల కోసం పోరాడే వారి వెంటే ఉంటాం: రాకేష్ టికాయిత్

by Javid Pasha |
రైతుల కోసం పోరాడే వారి వెంటే ఉంటాం: రాకేష్ టికాయిత్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల కోసం ఎవరు పోరాడినా వారి వెంట ఉంటామని.. వారికి పూర్తి మద్దతు ఇస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. టీఆర్ఎస్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్రం రైతుల మనోభావాలను దెబ్బతీస్తూ కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి యత్నిస్తోందని మండిపడ్డారు. ఓట్ల కోసం దీక్షలు చేయడం లేదని.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఉద్యమం కొనసాగుతుందన్నారు. దేశంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.

రైతులు మరణిస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే ఉంటారని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేసే పరిస్థితికి కేంద్రం తీసుకొచ్చిందని, ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం కేంద్రానికి సిగ్గుచేటు అన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్నారు. రైతు సమస్యలపై చత్తీస్‌ఘడ్ సీఎం, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రైతుల కోసం ఆందోళన చేస్తున్నారన్నారు.

దేశంలో రైతులు క్లిష్ట పరిస్థితికి చేరుకున్నారన్నారు. సాగుచ‌ట్టాల ర‌ద్దు కోసం ఢిల్లీలో 13 నెల‌ల పాటు ఉద్య‌మించామని స్పష్టం చేశారు. కేంద్రం ఏడాదికి 3 విడ‌తలుగా రైతుల‌కు రూ. 6 వేలు ఇస్తోందని, ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతుల‌ను ఉద్ధ‌రిస్తున్న‌ట్లు కేంద్రం మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేస్తున్న‌ది రాజ‌కీయ ఉద్య‌మం కాదు అని వెల్లడించారు. కేంద్రం రైతులపై వివక్షను విడనాడాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed