హాస్టల్లను పర్యవేక్షించాలి.. లేకుంటే డీఈఓ ఆఫీసును ముట్టడిస్తాం: ఎఫ్ఎస్ఐ

by Javid Pasha |
హాస్టల్లను పర్యవేక్షించాలి.. లేకుంటే డీఈఓ ఆఫీసును ముట్టడిస్తాం: ఎఫ్ఎస్ఐ
X

దిశ, చిన్నశంకరంపేట: ఆడపిల్లల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్, చిన్న శంకరంపేట మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు వంశీ పేర్కొన్నారు. అంతేకాకుండా హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు కోరారు. జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో సీసీ కెమెరా నిఘాలో లేని కేజీబీవీ హాస్టల్లు నడుస్తున్నాయని వంశీ మండిపడ్డారు. నీళ్ల చారుతోనే విద్యార్థులకు భోజనాలు పెడుతున్నట్లు ఆరోపించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీబీవీ హాస్టల్లలో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక హాస్టల్ ప్రిన్సిపాల్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు వచ్చే ప్రతి దాన్ని వారికి ఇవ్వకుండా వాటితో అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారని, విద్యార్థులు అడిగితే సర్టిఫికెట్లతో బెదిరిస్తున్నారని అన్నారు.

ఈ సందర్భంగా చిన్నశంకరంపేట మండలంలో ఉన్న కేజీబీవీ హాస్టల్‌ను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. మండలంలో ఉన్న కేజీబీవీ హాస్టల్‌లో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, విద్యార్థులకు నీళ్లచారుతోనే భోజనం సరిపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు 184 ఉండగా ఒక కిలో కందిపప్పుతోటే సరిపెడుతున్నారని ఆయన అన్నారు. ఆదివారం విద్యార్థులకు సరిపడా చికెన్ పెట్టడం లేదని ఆయన మండిపడ్డారు. పెరుగు కూడా సరిపడా పెట్టడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పర్యవేక్షణ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. శంకరంపేటలో ఉన్న కేజీబీవీ హాస్టల్లన్నీ జిల్లా ఉన్నత అధికారులు సందర్శన చేయాలని, లేనిపక్షంలో డీఈఓ ఆఫీస్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ చిన్న శంకరం పేట మండల నాయకులు శశి అజయ్ రాజు అనిల్ పాల్గొన్నారు.



Advertisement

Next Story

Most Viewed