మంత్రుల మెప్పు కోసం ఆరాటం.. నేటికీ బయటకు తీయని స్పీడ్ బోట్లు

by S Gopi |   ( Updated:2022-04-07 06:47:30.0  )
మంత్రుల మెప్పు కోసం ఆరాటం.. నేటికీ బయటకు తీయని స్పీడ్ బోట్లు
X

దిశ, వైరా: వైరా రిజర్వాయర్ నందు టూరిజం డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో 2 స్పీడ్ బోట్లను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు చేత గత నెల 13న హంగు ఆర్భాటాలతో స్పీడ్ బోటు లను ప్రారంభించారు. అనంతరం మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు స్పీడ్ బోటులో ప్రయాణం చేసి వైరా రిజర్వాయర్ అందాలను తిలకించారు. ప్రారంభించినాడు తప్ప నేటికీ ఆ స్పీడ్ బోట్లలో పర్యాటకులు ప్రయాణం చేసిన సందర్భాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. నేటి వరకు ఒడ్డుకే పరిమితమై పర్యాటకులను వెక్కిరిస్తున్నాయి. నిత్యం వైరా రిజర్వాయర్ అందాలను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉన్నా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ నిర్లక్ష్యం వల్ల పర్యాటకులకు నిరాశ ఎదురవుతుంది. స్పీడ్ బోటు ప్రారంభించిన బతుకమ్మ ఘాట్ వద్ద ఒక బోటుకు ఇంజిన్ లేకుండా మరో బోటు ఒడ్డునే ఉండటం సేఫ్టీ జాకెట్ మొత్తం చిందరవందరగా పడి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పడకేసిన పర్యాటక రంగం తిరిగి పరుగులు తీసేది ఎన్నడో అని పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.

మంత్రులు నాటిన మొక్కలు మాయం

గత నెల 13న వైరా మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు వచ్చిన ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా ఎక్సైజ్ శాఖ అధికారులు వైరా రిజర్వాయర్ ఆనకట్టపై బతుకమ్మ ఘాట్ సమీపంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రుల చేత మొక్కలు నాటించారు. మొక్కలు నాటిన మంత్రులు అలా వెళ్లారో లేదో సంబంధిత శాఖ వారు మంత్రులు నాటిన మొక్కలను అక్కడి నుండి తీసుకెళ్లడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. మంత్రుల మెప్పు కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు మంత్రుల రాక కోసం ఉదయం నుండి నానా హంగామా చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రాంతాలు శుభ్రం చేసి ముగ్గులు వేసి మరీ మంత్రుల చేత మొక్కలు నాటించారు. తిరిగి వారం రోజులు గడవకముందే ఆ మొక్కలను అక్కడనుండి తీసుకెళ్లడం వెనక ఆంతర్యమేమిటోనని మంత్రులు నాటిన మొక్కలను తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే వైరా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్నా రాజశేఖర్ పత్రికా ప్రకటన విడుదల చేసినా నేటికీ మొక్కలు మాయం చేసిన అధికారులపై చర్యలు మాత్రం శూన్యం.





Advertisement

Next Story

Most Viewed