'వరి ధాన్యానంతా కేంద్రం కొనుగోలు చేయాల్సిందే'

by Vinod kumar |
వరి ధాన్యానంతా కేంద్రం కొనుగోలు చేయాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో యాసంగిలో వరి ధాన్యానంతా కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆహారధాన్యాలన్నింటికి కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధమైన మద్దతును అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశాన్ని గురువారం లోక్ స‌భ‌లో 377 నిబంధ‌న కింద ప్రత్యేకంగా‌ ప్రస్తావించారు.


మహమ్మారి సమయంలో వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థను చితికిపోకుండా కాపాడిందన్నారు. రైతులు దీని వెనుక చోదక శక్తిగా ఉందన్నారు. రైతు సమాజాన్ని ఆదుకోవడం భారత ప్రభుత్వం, రాష్ట్రాల ఉమ్మడి కర్తవ్యం అని పేర్కొన్నారు. రైతులు తమ పొలాల్లో పండించిన పంటను కొనుగోలు చేసి మద్దతు ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర రైతు అనుకూల విధానాల వల్ల తెలంగాణలో రైతులు వరి ఉత్పత్తి చేస్తున్నారని, దేశవ్యాప్తంగా ఒకే విధమైన చట్టబద్ధమైన ఆహార ధాన్యాల సేకరణ విధానం లేనందున తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని రైతులకు వరి ధాన్యం సేకరణలో నష్టం కలిగించేలా ఎఫ్‌సీఐ ఎంపిక పద్ధతిని అవలంబిస్తోందని తెలిపారు.


పంజాబ్, హర్యానా నుండి మొత్తం మిగులు వరి ధాన్యం సేకరించిన ఎఫ్.సీ.ఐ తెలంగాణ రైతుల ధాన్యం సేకరించేందుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడమే దీనికి కారణం అని పేర్కొన్నారు. జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానాన్ని రూపొందించి, యాసంగిలో వరి మిగులును తెలంగాణ నుంచి సేకరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story