హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు!

by Harish |
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఎప్పటినుంచో హైదరాబాద్‌లో భారీ డేటా సెంటర్ నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగా కంపెనీ సానుకూల సంకేతాలు ఇచ్చింది. హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో దేశీయంగా నాలుగో డేటా సెంటర్‌ను 2025 నాటికి ప్రారంభించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే చెన్నై, పూణె, ముంబైలలో డేటా సెంటర్ సౌకర్యాలను నిర్వహిస్తోంది. 'హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ భారత్‌లోనే అతిపెద్దది అవుతుంది. సాధారణంగా డేటా మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటుకు రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయే డేటా సెంటర్‌ను 2025 నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించామని' మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి అన్నారు.

ఈ డేటా సెంటర్‌ను దశల వారీగా విస్తరిస్తామని, తద్వారా భారత్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ డేటా సెంటర్ సామర్థ్యాన్ని రెట్టింపు స్థాయిలో కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు ప్రారంభమయ్యాక ఈ సెంటర్ అమెరికాలో ఉన్న దానికంటే పెద్దదిగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed