భారత్‌లో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తి ప్రారంభించిన యాపిల్!

by Harish |
భారత్‌లో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తి ప్రారంభించిన యాపిల్!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన ఐఫోన్ 13 మోడల్ తయారీని ప్రారంభించినట్టు వెల్లడించింది. ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కంపెనీ స్థానికంగానే ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ల తయారీని చేపడుతున్నట్టు యాపిల్ తెలిపింది. ఇప్పటికే కంపెనీ తన ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిని దేశీయంగా చేపడుతోంది. అంతేకాకుండా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ వినియోగ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో యాపిల్ సంస్థ తన ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు స్థానిక ఉత్పత్తి ఎంతో ఉపయోగపడుతుందని, ఐఫోన్ 13 భారత్‌లోనే తయారు చేయడం సంతోషంగా ఉందని యాపిల్ ప్రతినిధి పేర్కొన్నారు.

స్థానిక వినియోగదారుల కోసం మరింత ఆకర్షించే డిజైన్, నాణ్యమైన ఫొటోలు, వీడియోలను అందించే అత్యాధునిక కెమెరా వ్యవస్థ, ఏ15 బయోనిక్ చిప్‌తో ఈ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తున్నామని కంపెనీ వివరించింది. ఐఫోన్ 13 కొత్త మోడల్ భారత్‌లోనే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. కాగా, గడిచిన రెండేళ్ల కాలంలో యాపిల్ సంస్థ భారత్‌లో గణనీయమైన అమ్మకాల వృద్ధిని సాధిస్తోంది.డిమాండ్ అధికంగా ఉంటున్న నేపథ్యంలో స్థానికంగా ఉత్పత్తి ద్వారా ఐఫోన్ 13 ధరలు మరింత తగ్గుతాయని, దానివల్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.

Advertisement

Next Story