ఢిల్లీ దీక్షకు కేసీఆర్? ఎంపీ సంతోష్ బిజీబిజీ!

by Nagaya |   ( Updated:2022-04-09 23:00:12.0  )
ఢిల్లీ దీక్షకు కేసీఆర్? ఎంపీ సంతోష్ బిజీబిజీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిర్వహిస్తున్న నిరసన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు పార్టీ వర్గాలు, తెలంగాణ భవన్ అధికారుల నుంచి సీఎం హాజరుపై అధికారిక సమాచారం లేదు. కానీ ముఖ్యమంత్రి హాజరయ్యే అవసరం ఏర్పడితే దానికి తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాలన్న ఉద్దేశంతో పోలీసులు, ప్రోటోకాల్ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఎంపీ సంతోష్ కుమార్, సీఎం సెక్యూరిటీ సిబ్బంది శనివారమే వేదిక, పరిసరాల్లోని భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ భవన్ (తెలంగాణ భవన్ కూడా ఇదే) ప్రాంగణంలో ప్రభుత్వపరంగా జరుగుతున్న తొలి నిరసన దీక్ష. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్ళు దాటినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి మాత్రమే ఈ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు దీక్షకు హాజరైతే ఇది రెండోసారి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల చైర్‌పర్సన్లు, మార్కెటింగ్ సొసైటీల చైర్‌పర్సన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, పలు స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. రాష్ట్రం నుంచి మొత్తంగా సుమారు మూడున్నర వేల మంది హాజరవుతారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు.

నగరంలో భారీ ఫ్లెక్సీలు

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన దీక్ష కావడంతో హిందీ, ఇంగ్లిషు భాషల్లో కేసీఆర్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. 'ఒకే దేశం – ఒకే ధాన్య సేకరణ విధానం', 'రైతుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలి', 'తెలంగాణ పట్ల వివక్షను విడనాడాలి' లాంటి నినాదాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు టీఆర్ఎస్ పార్టీ తరఫున వెలిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలను కూడా ఆ ఫ్లెక్సీలో ప్రముఖంగా ముద్రించింది. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్రమే కొనుగోలు చేయాలనే నినాదాలనూ ఆ ఫ్లెక్సీలపై పార్టీ ముద్రించింది.

Advertisement

Next Story