వడ్డీ వ్యాపారులకు సీపీ వార్నింగ్.. 'తీరు మార్చుకోకుంటే కటకటాల్లోకి నెట్టేస్తా'

by Manoj |
వడ్డీ వ్యాపారులకు సీపీ వార్నింగ్.. తీరు మార్చుకోకుంటే కటకటాల్లోకి నెట్టేస్తా
X

దిశ, ప్రతినిధి, కరీంనగర్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు అతిక్రమించి మరీ వడ్డీలు వసూలు చేస్తున్నారని, అక్రమ వడ్డీ వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. బుధవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్బీఐ విధించే వడ్డీ కన్నా వంద రెట్లు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. డబ్బులు అవసరం ఉన్న వారి వద్ద బ్లాంక్ చెక్స్, ప్రాంసరీ నోట్లలో ఏమీ రాయకుండానే సంతకాలు చేయించుకొని వడ్డీలకు ఇస్తున్నారని అన్నారు.

డబ్బులు చెల్లించని వారి చెక్కుల్లో ప్రాంసరీ నోట్లలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ రాసుకుని లీగల్ కోర్టును ఆశ్రయించి బాధితుల ఆస్తులను జప్తు చేయించడమో లేక వేతనాలను ద్వారా రికవరీ చేయించుకునేందుకు వ్యూహం వేసుకున్నారన్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఆర్థికంగా చితికిపోయిన వారి అవసరాలను వ్యాపారులు అనుకూలంగా మల్చుకుంటున్నారన్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏక కాలంలో 37 చోట్ల దాడులు చేశామని వివరించారు. ఈ దాడుల్లో వడ్డీ వ్యాపారులు నుండి సంతకం చేసిన ఖాళీ ప్రాంసరీ నోట్లు, డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కులతో పాటు రూ.52లక్షల 57వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటికి 10 మందిని అదుపులోకి తీసుకున్నామని, హుజూరాబాద్ డివిజన్‌లో 6 కేసులు, కరీంనగర్ డివిజన్‌లో 4 కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీపీ సత్యనారాయణ వెల్లడించారు.

చీటీ పైన చర్యలు..

చీటీ వ్యాపారులు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీ అన్నారు. చీటీల నిర్వహకులు తమకు అనుకూలమైన వారికి చీటీ పాట డబ్బులు ఇస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చీటీల నిర్వహకులు చేస్తున్న అక్రమాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో వడ్డీ వ్యాపారులు చేస్తున్న దారుణాలు, చీటీ నిర్వహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంశాలపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. వీరందరిపై ఉక్కుపాదం మోపి కటకటాల్లోకి నెట్టేస్తామని సీపీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed