- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
II వరల్డ్‌వార్ ముగిసిందని తెలియక 30 ఏళ్లు యుద్ధం చేసిన సోల్జర్..?!

దిశ, వెబ్‌డెస్క్ః ఇది ఎన్నో ఏళ్లనాటి కథ. ఆ యుద్దం ముగిసింది.. సైనికుడికీ కాలం చెల్లింది! అయినా, ఆ పోరాట యోధుని కథ మాత్రం సజీవంగానే సంచలనమవుతోంది. అవును, తన దేశం ఓడినా, శత్రువు ముందు లొంగిపోయినా, యుద్ధం పూర్తయ్యి మూడు దశాబ్ధాలు కావస్తున్నా 29 ఏళ్లు సుదీర్ఘంగా యుద్ధ భూమిలోనే పోరాడాడు. అలుపెరుగని ఇలాంటి సైనికుణ్ణి బహుశా ఏ పురాణాల్లోనూ చూడలేమేమో గానీ, ఈ నిజ చరిత్రలో ఉన్నాడు.. లెఫ్టినెంట్ హిరో ఒనోడా. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా అణుబాంబు దాడుల తర్వాత జపాన్ లొంగిపోయినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అయితే, యుద్ధం ముగిసిన దాదాపు మూడు దశాబ్దాలుగా అతనికి యుద్ధం ముగిసిందనే తెలియదు. అందుకే యుద్ధ భూమి నుండి ఈ జపాన్ సైనికుడు బయటికి రాలేదు. 29 ఏళ్ల తర్వాత బయటకొచ్చిన జపాన్ లెఫ్టినెంట్ హిరో ఒనోడా కథ ఇది. తనకు తానుగా లొంగిపోకూడదని, చచ్చిపోకూడదనే ఆదేశాలకు లోబడి, ఫిలిప్పీన్స్‌లను మట్టుబెట్టడానికి యుద్ధభూమిలో దిగిన జపాన్ ఇంటెలిజెన్స్ అధికారి జీవితం.
డిసెంబరు 1944లో ఫిలిప్పీన్స్‌లోని లుబాంగ్ ద్వీపానికి ఒనోడాను పంపినప్పుడు ఆయన వయస్సు 22 సంవత్సరాలు. యుద్ధంలో అతని విధినిర్వహణపై ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శత్రువుల ప్రయత్నాలకు అంతరాయం కలిగించి, విధ్వంసం చేయాలి. తనకు తానుగా ఎన్నటికీ లొంగిపోకూడదు, చచ్చిపోకూడదు. ఈ ఆదేశాలు అతని మనస్సులో ఎంతగా నాటుకుపోయాయంటే, 1945లో మిత్రరాజ్యాల దళాలు జపాన్ ద్వీపానికి చేరుకున్నప్పుడు, అతను, మరో ముగ్గురు సైనికులు కొండలపైకి వెళ్లిపోయారు. గెరిల్లా పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి అడవుల్లోనే దాక్కుంటూ యుద్ధం ముగిసిన 30 ఏళ్ల పాటు లొంగిపోకుండా, ప్రాణత్యాగం చేసుకోకుండా నిలిచిన జపాన్ సైనికులు వీళ్లే. కొబ్బరి పాలు, అరటి పళ్లు, దొంగిలించిన పశువులతో బతుకుతూ కాలం సాగించారు.
ఇన్నేళ్ల కాలంలో వాళ్లు స్థానిక పోలీసులతో అప్పుడప్పుడు గొడవ పడేవారంటే ఆశ్చర్యం కలగకమానదు. యుద్ధం ముగిసిందని తెలిసినా, ఇంటెలిజెన్స్ అధికారిగా తాను గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించమని ఆదేశాలున్నాయనీ, 'నేను సైనికుణ్ణి కాబట్టి ఆదేశాలను పాటిస్తాను' అని, 'నా కమాండర్ వచ్చి చెబితే తప్ప నేను యుద్ధ భూమిని వదిలిరానని' కచ్చితంగా చెప్పేవాడు. అలా యుద్ధం ముగిసిన తర్వాత ఆ నాటి కమాండర్‌ను హెలికాఫ్టర్లో తీసుకొచ్చి, చెప్పించిన తర్వాత 1974లో ఆయన నగరంలోకి అడుగుపెట్టాడు. దానికి ముందు, 1950లో అతని సహచరుడు జపాన్‌కు తిరిగి వచ్చినప్పుడు ఒనోడా గురించి ప్రపంచానికి తెలిసింది. ముగ్గురిలో ఒక సైనికుడు 1950లో మరణిస్తే, ఒనోడా మూడవ సహచరుడు 1972లో ఫిలిప్పీన్స్ సైనికులతో జరిగిన కాల్పుల్లో మరణించాడు. అప్పుడు, అక్కడ ఒనోడా ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ అది అతని సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేదు. అతడు మరో రెండు సంవత్సరాలు స్థిరంగా యుద్ధం ఆలోచనతోనే సహజీవనం చేశాడు.
ఒనోడా తన మాజీ కమాండింగ్ ఆఫీసర్ వ్యక్తిగతంగా వచ్చి, యుద్ధం ముగిసిందని ఒప్పించినప్పుడు మాత్రమే లొంగిపోవడానికి అంగీకరించాడు. ఇంతకాలం అక్కడే ఎందుకు ఉండిపోయామని అడిగితే, టోక్యోలోని అమెరికా అనుకూల ప్రభుత్వం మిషన్‌ను విధ్వంసం చేయడానికి జపానీయులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒనోడా తర్వాత తన ఆలోచనను సమర్థించుకున్నాడు. చివరకు లొంగిపోయి తన సర్వీస్ రైఫిల్‌ని ఇచ్చేయాల్సి వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు. అయితే, ఒనోడా యుద్ధం సమయంలో చేసిన అన్ని హత్యలకు ఫిలిప్పీన్స్ అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ కూడా ఒనోడాని క్షమించాడు. ఇక, ఒనోడా అదే సంవత్సరం మార్చిలో జపాన్‌కు తిరిగి వచ్చాడు. కానీ అక్కడ నివశించడం అతనికి కష్టమైంది. 1975లో బ్రెజిల్ వెళ్లాలని నిర్ణయించుకుని ఒక రైతుగా మారాడు.
ది గార్డియన్ ప్రకారం, జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా మాట్లాడుతూ, 'ఒనోడా జపాన్‌కు తిరిగి వచ్చినప్పుడు యుద్ధం ముగిసిందని నేను హామీ ఇచ్చానని నాకు స్పష్టంగా గుర్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత చాలా కాలం పాటు పోరాటం కొనసాగించిన కొద్దిమంది వ్యక్తులలో అతను ఒకడు. అతని ప్రయాణం జపాన్ సైనికులకు తమ దేశం పట్ల ఉన్న అచంచలమైన విధేయతకు నిదర్శనం' అన్నారు. ఒనోడా 91 సంవత్సరాల వయస్సులో 2014లో టోక్యోలో గుండె పోటుతో మరణించారు. కానీ, అతని నిబద్ధత, సంచలనాత్మకమైన అతని కథ మాత్రం సజీవంగా నిలిచింది. ఎంతో మంది దేశ భక్తులకు స్ఫూర్తిని పంచుతోంది.