విండ్‌ఫాల్ పన్నును తగ్గించిన కేంద్రం!

by Nagaya |
విండ్‌ఫాల్ పన్నును తగ్గించిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: ఇటీవల కేంద్రం దేశీయ చమురు సంస్థలపై విండ్‌ఫాల్ పన్ను విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇది ప్రవేశపెట్టిన రోజుల వ్యవధిలోనే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతూ రావడంతో చమురు కంపెనీలకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై విధించిన విండ్‌ఫాల్ పన్నును తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. అంతేకాకుండా ఇంధన ఎగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది.

ఇదివరకు దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై టన్నుకు రూ. 23,250గా ఉన్న విండ్‌ఫాల్ పన్నును తాజాగా రూ. 17 వేలకు తగ్గించింది. అదేవిధంగా లీటర్ పెట్రోల్ ఎగు మతిపై ఉన్న రూ. 6 పన్నును పూర్తిగా రద్దు చేయగా, డీజిల్ ఎగుమతిపై ఉన్న రూ. 13 పన్నును రూ. 11 కి తగ్గింది. అదేవిధంగా విమాన ఇంధనం జెట్ ఫ్యుయెల్‌పై పన్నును రూ. 6 నుంచి రూ. 4కి తగ్గించింది. ఈ నెల 1 నుంచి దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, ఎక్సైజ్ సుంకం వల్ల తగ్గిన ఆదాయాన్ని పొందేందుకు కేంద్రం విండ్‌ఫాల్ పన్నుతో పాటు ఎగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని తీసుకొచ్చింది. కంపెనీలు పొందే అదనపు లాభాలను కట్టడి చేయడానికి కూడా దీన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పన్నులను సమీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఇటీవల ముడి చమురు ధరలు తగ్గడంతో విండ్‌ఫాల్ పన్ను, ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story