ఎల్ఐసీ ఐపీఓకు రావడానికి మే 12 వరకు అవకాశం!

by Manoj |
ఎల్ఐసీ ఐపీఓకు రావడానికి మే 12 వరకు అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తుది పత్రాలను దాఖలు చేయకుండా ఐపీఓకు వెళ్లేందుకు మే 12 వరకు సమయం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. సంస్థ ఇటీవలే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఐపీఓకు ఆమోదం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 12 వరకు తుది పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదని, ఒకవేళ గడువు పూర్తయితే ఐపీఓ అనుమతి కోసం ఎల్ఐసీ సెబీకి మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, అనుకోకుండా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలవడం, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమవడం లాంటి పరిస్థితుల మధ్య ఐపీఓను తీసుకురావడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎంతకాలం ఐపీఓను వాయిదా ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ ఆలస్యమైతే తిరిగి మరోసారి సెబీ వద్ద ఐపీఓకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్న కారణంగా స్టాక్ మార్కెట్ల పరిస్థితులను గమనిస్తూ వీలైనంత త్వరలో తుది పత్రాలను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు అధికారి వివరించారు. తుది పత్రాల్లో సంస్థ షేర్ ధరతో పాటు పలు వివరాలు ఉంటాయని, ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే రూ. 20 వేల కోట్ల వరకు నిధులను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పెట్టుబడిదారులు ఐపీఓలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించరని, కాబట్టి మార్కెట్లలో సానుకూల పరిణామాల బట్టి ఐపీఓకు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed