ముక్కులు మూస్తే కానీ వెళ్లలేని పరిస్థితి.. అది సంగారెడ్డి మున్సిపాలిటీ దుస్థితి

by Satheesh |
ముక్కులు మూస్తే కానీ వెళ్లలేని పరిస్థితి.. అది సంగారెడ్డి మున్సిపాలిటీ దుస్థితి
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణం కంపుకొడుతున్నది. పలు కాలనీల నుంచి ముక్కుమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. చెత్తతో నిండిపోయిన మురికి కాలువలు దుర్ఘందాన్ని వెదజల్లుతున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పల నుంచి ముక్కు పుటలదిరే కంపు వాసన వస్తున్నది. ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్​ వ్యవస్థ పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసింది. ప్రభుత్వం చేపడున్న 'పట్టణ ప్రగతి' అనవాళ్లు ఇక్కడ ఏ మాత్రం కనిపించడం లేదు. బహుశ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండవని అధికారులే అంటున్నారు. మున్సిపల్​వ్యవస్థ, పాలకవర్గం నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని చెప్పక తప్పదు. ఇటీవల సీఎం కేసీఆర్​ సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు చేయడంతో వాటిని ఎక్కడ..? ఎలా..? వినియోగించాలో పరిశీలించడం కోసం అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​చేపట్టిన 'బస్తీబాట'లో అందరూ ముక్కులు మూసుకుంటున్నారు. మా దయనీయ పరిస్థితులు కళ్లారా చూడాలని కాలనీ వాసులు వారికి చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో అధికార పార్టీ నేతలకు ఈ బస్తీ బాట తలనొప్పిగా మారింది.

గ్రేడ్​–1 మున్సిపాలిటీ.. దారుణమైన దుస్థితి

సంగారెడ్డి మున్సిపాలిటీ గ్రేడ్​–1గా గతంలోనే అప్​గ్రేడ్​అయ్యింది. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులున్నాయి. 22,341 గృహాలు ఉండగా.. 85,385 మంది జనాబానివాసముంటున్నది. ఈ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం 280 మంది పనిచేస్తున్నారు. రోజు వారిగా 6 ట్రాక్టర్లు చెత్త తరలింపుకు వినియోగిస్తున్నారు. పట్టణప్రగతిలో భాగంగా చెత్త సేకరణకు ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు కూడా పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా పట్టణ పరిధిలో మొత్తం 30 వరకు పేదల బస్తీలు ఉన్నాయి. ఈ స్లమ్​ఏరియాలో చెత్త తరలింపు అస్త్యవ్యస్థంగా మారింది. గ్రేడ్​1 మున్సిపాలిటీ అయినప్పటికీ పట్టణ పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. డంప్​యార్డు గుర్తింపు విషయంలో కొద్ది రోజుల పాటు గొడవలు జరగగా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌లు చొరవతీసుకుని పసల్​వాది సమీపంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెత్త అక్కడకి తరలిస్తున్నారు.

చెత్తతో నిండిన కాలువలు, కుప్పలుగా చెత్త

చాలా వార్డుల్లో మురికి కాలువలు రోజులుగా నిండిపోయి ఉన్నాయి. మురికి నీరు సరఫరా నిలిచిపోవడంతో కంపువాసన కొడుతున్నది. చెత్త వేయడంతో కాలువలు పూడుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మురికి నిండి కాలువలు కంపు కొడుతుంటే, మరోవైపు పేరుకుపోయిన చెత్త కుప్పలు దుర్ఘందాన్ని వెదజల్లుతున్నాయి. నాల్​సాబ్​గడ్డ, కింది బస్తీలతో పాటు స్లమ్​ఏరియాలు పూర్తిగా కంపుకొడుతున్నాయి. ఆ కాలనీల నుంచి తిరగలేని పరిస్థితులు ఉండగా అక్కడే నివసించే వారి దుస్థితి ఎలా ఉంటుందోఅర్థం చేసుకోవచ్చు. రోజువారిగా మున్సిపల్​సిబ్బంది, మురికి కాలువలు శుభ్రం చేసి, చెత్త తరలిస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదిలా వుండగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

ముక్కులు మూసుకుని ప్రజాప్రతినిధుల 'బస్తీబాట'

ఇటీవల నారాయణఖేడ్‌కు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిధులను అవసరమైన చోట వినియోగించాలని, అందుకోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీల్లో తిరిగి పనులు గుర్తించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్​జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్​పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి సంగారెడ్డిలో బస్తీబాట చేపట్టారు. ఆయా వార్డుల్లోకి వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ బస్తీబాట ద్వారా పట్టణంలో దారుణమైన పరిస్థితులు, కాలనీలు కంపుకొడుతుండడంతో ముక్కులు మూసుకుని తిరుగుతున్నారు. ఈ పరిస్థితులు చూసి చింతా ప్రభాకర్​ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అధికారులు ఏం చేస్తున్నట్లు అని సూటిగా ప్రశ్నించారు. మేం తీస్తున్నాం.. జనం మళ్లీ చెత్త కాలవల్లో వేస్తున్నారంటూ మున్సిపల్​సిబ్బంది సమాధానం ఇస్తున్నారు.

పాలకవర్గంపై ప్రజల ఆగ్రహం..

సంగారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గ పనితీరుపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్​చైర్మన్, పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని బస్తీబాటలో స్థానికులు చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువస్తున్నారు. నిండిపోయిన మురికి కాలువలు, పేరుకు పోయిన చెత్తను చూడాలని స్థానికులు ఆయనకు చూపించారు. పలు చోట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కౌన్సిలర్లు అక్కడి నుంచి జారుకోక తప్పలేదు. మున్సిపల్​పాలకవర్గ పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. కేసీఆర్​రూ.50 కోట్లు ఇచ్చినా ఇక్కడ పనులు చేయరనే అభిప్రాయం వస్తున్నది. జిల్లా కలెక్టర్​స్పందించి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, మున్సిపాలిటీలో కాలువలు శుభ్రం చేయించి, చెత్తను తొలగించాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కౌన్సిలర్లు, మున్సిపల్​సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూడా కాలనీ వాసులు డిమాండ్​చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed