హైకోర్టు న్యాయమూర్తిగా గద్వాల వాసి అల్లుడు..

by Manoj |
హైకోర్టు న్యాయమూర్తిగా గద్వాల వాసి అల్లుడు..
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా గద్వాల వాసి ప్రహ్లాద రావు అల్లుడు, వనపర్తి పట్టణానికి చెందిన జస్టిస్, డాక్టర్ దేవరాజ్ నాగార్జున పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గురువారం ఉదయం హైకోర్టు ఒకటవ నెంబర్ కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వకేట్ జనరల్ బీ. ఎస్. ప్రసాద్, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. అనంతరం ఆయన చాంబర్‌లో వనపర్తికి చెందిన పూజారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

మురిసిన తల్లి..

కన్నకొడుకు డాక్టర్ దేవరాజ్ నాగార్జున ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాతృమూర్తి విమలాదేవి పాల్గొన్నారు. తన వయస్సును సైతం లెక్క చేయకుండా కొడుకు ప్రమాణ స్వీకారోత్సవంలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. ఆమెతో పాటు నాగార్జున సతీమణి సి.అమూల్య, కూతురు అపూర్వ, అల్లుడు మనుక్రాంత్, నాగార్జున సోదరులు డి.చిరంజీవి, డి.భరత్ కుమార్ 24వ కోర్టు హాలులో కేసుల విచారణ ప్రక్రియను ఆనందంతో తిలకించారు. గద్వాల పట్టణానికి చెందిన చాగాపురం ప్రహ్లాదరావు, సావిత్రిదేవిల కుమార్తె సి.అమూల్యను నాగార్జున వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ డి. నాగార్జునకు ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన న్యాయవాద సంఘాల నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జస్టిస్ నాగార్జునను సన్మానించిన వారిలో గద్వాలకు చెందిన న్యాయవాదులు జి.వెంకటాద్రి రెడ్డి, సి.ప్రదీప్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, నర్సింహులు, శ్రీధర్ తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed