టీఆర్ఎస్ ప్రభుత్వం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

by Vinod kumar |
టీఆర్ఎస్ ప్రభుత్వం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్: ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ప్రభుత్వ భూముల‌ను విచ్చల‌విడిగా విక్రయిస్తూ.. టీఆర్ఎస్ స‌ర్కార్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంద‌ని, దీనికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి వంత‌పాడ‌టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. తుర్కయంజాల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరులో 130 ఎక‌రాలు, మున‌గ‌నూరులో 70 ఎక‌రాలు, తుర్కయంజాల్‌లో 10 ఎక‌రాలు, మ‌న్నెగూడ‌లోని స‌ర్వే నెంబ‌ర్ 27లోని 46 ఎక‌రాల‌ను ప్రభుత్వం హెచ్ ఎండీఏ ద్వారా ప్లాట్లుగా మ‌లిచి విక్రయించేందుకు ప్రయ‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. దళితులు, బీసీ, మైనార్టీలు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌ను భ‌య‌పెట్టి భూములు లాక్కొని, కేవ‌లం 300 గ‌జాలు ఇస్తామ‌ని మ‌భ్యపెడుతున్నార‌ని దుయ్యబ‌ట్టారు.


తొర్రూరులో హెచ్ఎండీఏ ద్వారా ప్లాట్లు ఏర్పాటు చేసి వేలంలో విక్రయిస్తున్నార‌ని, ప్రజ‌లెవ‌రూ వీటిని కొనుగోలు చేయొద్దని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ మాయ‌మాట‌ల‌ను న‌మ్మి ఒక‌వేళ కొనుగోలు చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చాక వారి డ‌బ్బును తిరిగి ఇచ్చి.. భూముల‌ను ర‌క్షిస్తామ‌న్నారు. ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి అధికారం ఉంది క‌దా అని మొండిగా వ్యవ‌హ‌రిస్తూ భూముల‌ను అమ్మితే.. ప్రజ‌లు వారని ఊర్లలో తిరిగ‌నివ్వర‌ని హెచ్చరించారు. ఈ భూముల‌ను అమ్మకుండా చూడాల్సిన బాధ్యత కిష‌న్‌రెడ్డిదే అని, వీటిని కాపాడ‌క‌పోతే.. ఆయ‌న్ని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని అన్నారు. ప్రజ‌ల‌కు అండ‌గా ఉంటారో.. ప్రభుత్వానికి కొమ్ముకాస్తారో తేల్చుకోవాల‌న్నారు.

అధికారుల‌తో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..

తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారంలో ఉంద‌న్న అక్కసుతో పుర‌పాల‌క అభివృద్ధికి ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి ఎలాంటి చేయూత‌నివ్వడంలేద‌ని మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి మండిప‌డ్డారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వక‌పోగా.. మున్సిప‌ల్ నిధులు కూడా ఖ‌ర్చు చేయ‌నీయ‌కుండా అధికారుల‌తో అడ్డుకుంటున్నార‌ని ఆరోపించారు. మున్సిప‌ల్ ప్రజ‌లు చెల్లించిన ట్యాక్స్‌ల‌తో రూ.20 కోట్ల ప‌నుల‌కు కౌన్సిల్ తీర్మానం చేసినా.. క‌లెక్టర్‌కు చెప్పి అడ్డుకుంటున్నార‌ని దుయ్యబ‌ట్టారు. కోర్టు కేసులున్న భూముల్లో మంత్రి కేటీఆర్‌తో మున్సిప‌ల్ భ‌వ‌నానికి, స‌మీకృత మార్కెట్ నిర్మాణానికి కిష‌న్‌రెడ్డి శంకుస్థాప‌న‌లు చేయించార‌ని, వాటిని ఇప్పుడు ఆ స్థల య‌జ‌మానులు అడ్డుకుంటున్నార‌ని ఆరోపించారు.


క‌ల్యాణ‌ల‌క్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి త‌న కొడుకు ద్వారా ఇప్పించ‌డం దారుణ‌మ‌న్నారు. ప్రజ‌ల ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉండ‌గా త‌న కొడుకు ద్వారా చెక్కులు ఇప్పించే హ‌క్కు ఎవ‌రు ఇచ్చార‌ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్‌రెడ్డి రాంరెడ్డి, రొక్కం భీంరెడ్డి, చైర్ ప‌ర్సన్ అనురాధ‌, వైస్ చైర్ ప‌ర్సన్ హ‌రితాధ‌న్‌రాజ్‌గౌడ్‌, ఫ్లోర్ లీడ‌ర్ కొశికె ఐల‌య్య, కౌన్సిల‌ర్లు కొత్తకుర్మ మంగ‌మ్మ శివ‌కుమార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed