దిశ ఎఫెక్ట్.. కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

by Vinod kumar |   ( Updated:2022-03-17 14:38:18.0  )
దిశ ఎఫెక్ట్.. కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
X

దిశ, కామారెడ్డి రూరల్: కల్తీ కల్లు విక్రయాలపై దిశ పత్రికలో వస్తున్న వరుస కథనాలు ఎక్సైజ్ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. రోజుకొక దుకాణంలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కల్లు ముస్తేదారులైతే ఇదెక్కడి తలనొప్పి అంటూ తలలు పట్టుకుంటున్నారు. వరుసగా వస్తున్న కథనాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల దిశ పత్రికలో వచ్చిన 'మత్తులో చిత్తు' 'కల్లు దుకాణాల్లో తనిఖీలేవి' కథనాలకు ఎక్సైజ్ అధికారులు స్పందించారు. కామారెడ్డి మండలంలోని దేవునిపల్లిలో 5 దుకాణాలు, గర్గుల్, కామారెడ్డి ఆర్ బి నగర్ లో, రామేశ్వరం పల్లి, ఇస్రోజివాడి తో పాటు కామారెడ్డి టిసిఎస్ 1, టిసి ఎస్-2 లలోనీ కల్లు దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.


ఈ సందర్భంగా దుకాణాల్లో తయారు చేసిన కల్లు నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు. గురువారం ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో మూస్తేదారులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు కల్లు మూస్తేదారులతో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారని కథనం రావడంతో ఆ శాఖ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్నట్టుగా సమాచారం. ఇటీవల ఎక్సైజ్ శాఖలో అంతా కొత్త అధికారులే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నుంచి రోజు ఏదో ఒక చోట నిర్వీరామంగా తనిఖీలు చేపడుతూనే ఉన్నారు.


అనంతరం ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి రోజు కల్లు దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నామన్నారు. కల్లు శాంపిల్ తీసుకుని పరీక్షల నిమిత్తం పంపిస్తున్నామని, పరీక్షల్లో కల్తీ కల్లు అని తేలితే దుకాణాన్ని సీజ్ చేస్తామని, కల్లు మూస్తేదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు దిశలో వస్తున్న కథనాలపై కల్లు మూస్తేదారులు కలవరానికి గురవుతున్నారు. ఎక్కడ తమ దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటారోనని ఆందోళనకు గురవుతున్నారు.


దిశ పత్రికలో వచ్చిన కథనాల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తుండటం తో ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరీక్షలకు పంపిన శాంపిల్ నివేదికలు నెల రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంపిన శాంపిల్స్ లో నిజాలు వెలుగులోకి వస్తాయా.. లేదా అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed