TET అభ్యర్థుల కష్టాలు.. వేరే జిల్లాలో టెట్ రాయాల్సిందేనా..?

by Vinod kumar |
TET అభ్యర్థుల కష్టాలు.. వేరే జిల్లాలో టెట్ రాయాల్సిందేనా..?
X

దిశ, నవీపేట్: ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని సీఎం ప్రకటించారు. భర్తీ ప్రక్రియకు ముఖ్యమైన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) కు నోటిఫికేషన్ జారీ చేసి.. గత నెల 26 నుంచి ఈ నెల 12 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుకు అవకాశం ఉండడంతో వేల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మంగళవారం రోజున ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు నిజామాబాద్ సెంటర్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. చేసేది ఏమి లేక పక్క జిల్లాలు కామారెడ్డి, నిర్మల్ జిల్లాలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో నిర్వహించిన టెట్ పరీక్షలో జిల్లా అభ్యర్థులకు నిజామాబాద్ సెంటర్ లేకపోయేసరికి కామారెడ్డి, కరీంనగర్ కు వెళ్లి పరీక్షలు రాసి వచ్చారు. పక్క జిల్లా వెళ్లి సెంటర్లను వెతుక్కునే సరికి పరీక్ష సమయం అయిపోయిందని ఆవేదన చెందారు.

వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం, ఫైనల్ ఇయర్ చదువుతున్న బి.ఎడ్, డి.ఎడ్ అభ్యర్థులకు టెట్ రాసేందుకు అవకాశం ఇవ్వడం లాంటి కారణాలతో పాటు టెట్ ఉత్తీర్ణత సాధిస్తే జీవిత కాలం అర్హత ఇవ్వడంతో టెట్ రాసేందుకు అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈసారి పేపర్-1 రాసేందుకు డి.ఎడ్. అభ్యర్థులతో పాటుగా బి.ఎడ్ వారికి అవకాశం రావడంతో టెట్ రాసేందుకు బి.ఎడ్ అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.

గతంలో రాసిన అభ్యర్థులను సహితం దృష్టిలో ఉంచుకొని అధికారులు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు ఇతర జిల్లాలో పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఈ నెల 12 చివరి తేదీ కావడంతో ఇంకా దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు వందల సంఖ్యలో ఉంటారని, మహిళ అభ్యర్థులు, దివ్యంగులు, ఇతర జిల్లాలో పరీక్షలకు హాజరు కావాలంటే సవాలుతో పాటుగా ఆర్థిక భారం అవుతుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని పరీక్ష సెంటర్లు పెంచి, ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలోనే రాసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇతర జిల్లాలో పరీక్షలు రాయడం కష్టం: టెట్ అభ్యర్థి స్రవంతి, అభ్యర్థి

మంగళవారం రాత్రి టెట్ పరీక్షకు ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు మీ సేవకు వెళితే.. నిజామాబాద్ జిల్లా సెంటర్ కనిపియ్యలేదు. దీంతో కామారెడ్డి జిల్లాను ఎగ్జామ్ సెంటర్‌గా ఎంచుకున్నాను. 2017 లో కూడా టెట్ పరీక్ష కేంద్రం కరీంనగర్ కావడంతో బస్సులో వెళ్లి సెంటర్ దొరకకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. చివరకు ఎలాగోలా పరీక్ష రాసి వచ్చాము. రెండు పేపర్లు రాస్తున్నాం కాబట్టి అధికారులు సెంటర్లను పెంచి, నిజామాబాద్‌లోనే రాసేలా అవకాశం కల్పించాలి.

కామారెడ్డి కూడా లేదు: టెట్ అభ్యర్థి చెన్న రమేష్


మంగళవారం రాత్రి టెట్‌కు అప్లై చేసుకున్న నిజామాబాద్ సెంటర్ కనిపించకపోయేసరికి కామారెడ్డి సెంటర్‌ను ఎంచుకున్నాను. బుధవారం మధ్యాహ్నం నుండి కామారెడ్డి కూడా కనిపించకపోయేసరికి అభ్యర్థులు నిర్మల్‌ను ఎంచుకుంటున్నారు. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా జిల్లాలోనే సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఎగ్జామ్ కోసం పక్క జిల్లాలకు పోతే సమయం వృధా అవుతుంది.

Advertisement

Next Story