పోలీస్ స్టేషన్ ఎదుట భార్యతో కలిసి కానిస్టేబుల్ హల్‌చల్

by GSrikanth |
పోలీస్ స్టేషన్ ఎదుట భార్యతో కలిసి కానిస్టేబుల్ హల్‌చల్
X

దిశ, మెదక్: ఉన్నతాధికారులు ఆకారణంగా తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ ఎదుట హల్‌చల్ చేశాడు. అన్యాయంగా తనను మెదక్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారని ఆరోపిస్తూ.. ఆత్మహత్య చేసుకుంటానని వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ నాజం నాయక్‌ను పనిష్మెంట్ కింద మెదక్ ఏఆర్ హెడ్ క్వార్టర్‌కు బదిలీ చేశారు. బదిలీ చేసిన స్థానంలో జాయిన్ కాకుంటే ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాజం నాయక్ సోమవారం అర్ధరాత్రి మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్‌కు తన భార్యతో కలిసి వచ్చాడు. తనను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బదిలీని రద్దు చేయకుంటే కుటుంబంతో సహా ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. విషయం తెలిసిన పోలీసు అధికారులు కానిస్టేబుల్‌ను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. అయితే, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంటానంటూ హెడ్‌ క్వార్టర్స్ వద్ద హల్‌చల్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసు అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేరు.

కొంత మంది అవినీతి అధికారులే..

కానిస్టేబుల్ దగ్గరనుంచి అధికారుల వరకు పోలీసులంతా డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాలు జారీ చేయడంతో కొందరు అధికారులకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలోనే సక్రమంగా డ్యూటీ చేయని వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు సిఫారసులను ఎస్పీ లెక్కచేయకుండా, ఒక కానిస్టేబుల్‌తో ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని కొంతమంది పోలీసు అధికారులు వాదిస్తు్న్నారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed