టెక్ట్స్‌బుక్‌లో 'వ‌ర‌క‌ట్నం' పాఠం! 'అగ్లీ గార్ల్స్' కూడా పెళ్లి చేసుకోవ‌చ్చంట‌!!

by Sumithra |   ( Updated:2023-02-04 12:15:08.0  )
టెక్ట్స్‌బుక్‌లో వ‌ర‌క‌ట్నం పాఠం! అగ్లీ గార్ల్స్ కూడా పెళ్లి చేసుకోవ‌చ్చంట‌!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః విద్య‌ విజ్ఞానంతో పాటు సంస్కారం నేర్పాలి. మ‌న‌ల్ని మ‌నం గౌర‌వించుకున్న‌ట్లే ఎదుటి వారిని గౌర‌వించాల‌నే బుద్ధిని నేర్పాలి. అన్నింటికీ మించి, మూఢాచారాల‌ను, మూర్ఖాలోచ‌న‌ల‌ను పార‌దోలి శాస్త్రీయ‌త దిశ‌గా సానుకూల ధృక్పథాన్ని నేర్పాలి. అయితే, ఇండియాలో ప‌రిస్థితి అధ్వాన్నంగానే కాదు, అస‌హ్యంగా మారింది. వ‌ర‌క‌ట్నంతో ఎన్నో లాభాలున్నాయంటూ కాలేజీ పుస్త‌కాల్లో పాఠాలుగా చెబుతున్న తీరు ప్ర‌జ‌ల్ని అస‌హ‌నానికి గురిచేస్తోంది. వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టాలు రావ‌డం, చ‌దువుకున్నోళ్ల‌లో కాస్త అవ‌గాహ‌న పెర‌గ‌డంతో ఇప్పుడిప్పుడే ఈ దురాచారం కాస్త త‌గ్గుమొఖం ప‌డుతుంది. ఇలాంటి త‌రుణంలో ఏకంగా కాలేజీ పుస్త‌కాల్లోనే, అధికారికంగా, బ‌హిరంగంగా, వ‌ర‌క‌ట్నం 'మ‌హా ప్ర‌సాదం' అని తిరోగమన పాఠాలు నేర్ప‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు? అవును, న‌ర్సింగ్ విద్యార్థుల సామాజిక శాస్త్రం టెక్ట్స్ బుక్‌లో ఉన్న ఈ పాఠం తాలూకు పేజీ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ పాఠం వ‌ర‌క‌ట్న దురాచారం గొప్పదంటూ, దాని వ‌ల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటూ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక, ఈ పుస్త‌కాన్ని ర‌చించింది కూడా ఓ మ‌హిళా ఉపాధ్యాయురాలే కావ‌డం పెద్ద విశేషం. టికె ఇంద్రాణి రచించిన 'టెక్స్ట్‌బుక్ ఆఫ్ సోషియాలజీ ఫర్ నర్సెస్‌'లో "కట్నం మెరిట్‌లు" అనే ఉపశీర్షిక క్రింద స‌ద‌రు విభాగం ఉంది. ఈ పుస్తకాన్ని నర్సింగ్ విద్యార్థులకు రీడింగ్ మెటీరియల్‌గా అందిస్తున్నారు. ఇందులో మెరిట్‌లు ప‌రిశీలిస్తే, క‌ట్నం డ‌బ్బుల‌తో ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లు, వాహనాల వంటి ఉపకరణాలతో 'కొత్త సంసారాన్ని' హుందాగా స్థాపించుకోవ‌చ్చంట‌. అంతేనా, కట్నం అంటే తల్లిదండ్రుల ఆస్తిలో అమ్మాయిలకు చెందే వాటానే అంటూ ఓ లాజిక్ కూడా జోడించారు. మ‌రో అంశం ఏంటంటే, ఈ కాలంలో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చ‌దివిస్తున్నారు గ‌నుక‌ తక్కువ కట్నం ఇవ్వొచ్చంట‌. ఈ పాఠంలో చివరగా, అత్యంత దారుణ‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. 'అంద‌గా'లేని అమ్మాయిలు (అగ్లీ గర్ల్స్‌) కూడా హాయిగా పెళ్లి చేసుకోడానికి ఈ వ‌ర‌క‌ట్నం ఎంతో స‌హాయం చేస్తుంద‌ని స‌ద‌రు పాఠం పేర్కొంది.

అప‌ర్ణ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ వైరల్ కావడంతో, శివసేన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ట్యాగ్ చేసి, అలాంటి పుస్తకాలను సర్క్యులేషన్ నుండి తొలగించాలని నెటిజ‌న్లు విరుచుకుప‌డ్డారు. వ‌ర‌క‌ట్నం మెరిట్స్ పాఠంపై ఇప్పుడు ఇంటర్నెట్‌లో చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది దీనిని సిగ్గుచేటుగా పేర్కొన్నారు. ఇలా 'స్త్రీ ద్వేషం', తిరోగమనానికి దారితీసే అంశాలను విద్యార్థులకు బోధించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed