గల్లీకో ఏటీఎం ఎప్పుడొస్తది.. ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చింతా ఫైర్..

by Satheesh |
గల్లీకో ఏటీఎం ఎప్పుడొస్తది.. ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చింతా ఫైర్..
X

దిశ, సంగారెడ్డి: ఎమ్మెల్యేగా గెలిపిస్తే 40 వేల ఇళ్లు ఇస్తానని చెప్పిన మాట ఏమైందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డిలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు 40 వేల ఇళ్ల స్థలాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఇప్పటికి అమలు చేయడం లేదని ఆరోపించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇళ్ల స్థలాలు ఇస్తే వాటికి ఎందుకు పొజిషన్ చూపించడం లేదని విమర్శించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో గల్లీకో ఏటీఎం ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువస్తాం అని ప్రగల్భాలు పలికారని దానిని ఎవరైనా ఆపారా అంటూ ఎద్దేవా చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఐఐటి తీసుకు వచ్చాను, హైవే రోడ్డు తీసుకు వచ్చాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని.. ఐఐటిని హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కందిలో ఏర్పాటు చేసిందని తెలిపారు. అది ఐఐటి హైదరాబాద్‌గానే ఉందని.. ఐఐటీ కంది అని ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు.

రోడ్డు విస్తరణలో భాగంగా జహీరాబాద్ వరకు నేషనల్ హైవే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. జగ్గారెడ్డి చేసింది ఏమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ వాదులను వ్యతిరేకిస్తూ వారిపై కేసులు పెట్టించిన ఘనత జగ్గారెడ్డిదే అని ఆరోపించారు. కరోనా కాలంలో నియోజకవర్గానికి కూడా రాని వ్యక్తి.. ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తూ గాంధీ భవన్‌కే పరిమితమయ్యాడన్నారు. పిట్టలదొర కంటే ఎక్కువని ఆరోపించారు. కేసీఆర్ విడుదల చేసిన నిధులతో ప్రజలకు కాలనీలలో అత్యవసర పనులను మాత్రమే చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల నర్సింలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి చక్రపాణి ప్రవీణ్ కుమార్, శ్రావణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story