హామీలు నెరవేర్చకపోతే కేసు పెట్టండి: ఆప్ మేనిఫెస్టో

by Disha Desk |
హామీలు నెరవేర్చకపోతే కేసు పెట్టండి: ఆప్ మేనిఫెస్టో
X

డెహ్రడూన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కేసు పెట్టవచ్చని ఉత్తరాఖండ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి అజయ్ కొథియాల్ అన్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం ఆప్ 'వచన్ పాత్ర' పేరుతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా అఫిడవిట్‌తో మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు ఆప్ నేత గోపాల్ రాయ్ తెలిపారు. దీనిలో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన 10 హామీలతో పాటు, కొథియాల్ ఇచ్చిన 119 హామీలు ఉన్నాయని తెలిపారు. ప్రధానంగా వీటిలో ఉత్తరాఖండ్‌ను అవినీతిరహితంగా మార్చడంతో పాటు, వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్‌ను రెండింతలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి 300 యూనిట్ల‌లోపు ఉచిత కరెంట్‌తో పాటు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా రూ.5000 భత్యం, ఉచిత వైద్యం, 18 ఏళ్లు పైబడిన మహిళలకు రూ.1000 భత్యం అందించనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే ఉచిత దేవాలయాల సందర్శనతో పాటు, హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తామని అన్నారు. పార్టీ నేత గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. 'ప్రతి ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్‌లు మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలను మోసం చేశాయి. ఈ ఏడాది కూడా అదే కొనసాగుతోంది. కానీ ఉత్తరాఖండ్ చరిత్రలో మొదటిసారిగా ఆప్ సీఎం అభ్యర్థి సంతకంతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశాం' అని తెలిపారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే వాగ్దానాలు అన్ని నెరవేరుస్తామని చెప్పారు.

Advertisement

Next Story