విద్యుత్ చార్జీలు పెంపునకు చంద్రబాబే పేటెంట్: మంత్రి బొత్స సత్యనారాయణ

by Vinod kumar |
విద్యుత్ చార్జీలు పెంపునకు చంద్రబాబే పేటెంట్: మంత్రి బొత్స సత్యనారాయణ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగుతుంది. విపక్షాలన్నీ రోడ్డెక్కాయి. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి, పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం అని వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన 'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం' పై సమీక్ష జరిగింది. సమీక్ష అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు హయాంలో ఇష్టం వచ్చినట్లు విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు-బషీర్ బాగ్ కాల్పులకు చంద్రబాబే పేటెంట్ అని ఆరోపించారు. చంద్రబాబులా స్నోలు, పౌడర్లకు అప్పులు తెచ్చి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. గ్రామ గ్రామానికి బాబు అవినీతిని విస్తరిస్తే.. జగన్ సంక్షేమం, అభివృద్ధిని తీసుకువెళుతున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

విద్యుత్ చార్జీలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు..

విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. వాటిని పరిశీలించి, తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్‌ చార్జీలపై చంద్రబాబు నాయుడికి అసలు మాట్లాడే అర్హతే లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచాడు? టీడీపీ హయాంలో ఎన్నిసార్లు పెరిగాయి. విద్యుత్ చార్జీల పెంపునకు, బషీర్‌బాగ్‌లో కాల్పులకు చంద్రబాబు పేటెంట్‌ కదా? ఎవరి హయాంలో రైతులపై కాల్పులు జరిగాయి? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

అడ్డగోలుగా విద్యుత్‌ చార్జీలు పెరిగితేనో, పెంచితేనే మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. టీడీపీ హయాంలో టారిఫ్ ఎంత ఉంది? డిస్కమ్‌లకు ఆదాయం ఎంత, అప్పులు ఎంత? వాటి నిర్వహణ వ్యయం ఎంత?.. ఇలాంటి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రతిపక్షాలు ప్రాక్టికల్‌గా మాట్లాడితే బాగుంటుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు పెంచలేదు అని అంటున్న చంద్రబాబు బషీర్ బాగ్ కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి విద్యుత్ చార్జీలు పెంపు కారణం కాదా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు వైసీపీ ప్రభుత్వం తెగ అప్పులు చేస్తున్నారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. అప్పులు చేసి మేం మా ఇళ్ళల్లో పెట్టుకుంటున్నామా? లేకపోతే చంద్రబాబులా స్నోలు, పౌడర్లకు అప్పులు తెచ్చి దుర్వినియోగం చేస్తున్నామా? ప్రభుత్వం చేసే ప్రతి అప్పుకు లెక్క ఉంది. రూ. 50 వేల కోట్లకు లెక్కలు లేవంటూ చిన్నపిల్లలు మాట్లాడినట్లు మాట్లాడమా? పరిజ్ఞానం, పరిపక్వత ఉన్న మాటలేనా అవి?


మూడేళ్లలో లక్షా 32 వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాల ద్వారా, డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేసింది వాస్తవం కాదా? నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదా? రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టడం లేదా? వీటన్నింటికి లెక్కలు ఉన్నాయి కదా? ఈ లెక్కలన్నీ ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే లెక్కలు చెప్పారు. ప్రజల కోసం పారదర్శకంగా చేస్తున్న ఖర్చుపై సీబీఐ విచారణ చేయించాలని అడగటం విడ్డూరంగా ఉంది. మరి కాగ్‌ ఎందుకు ఉంది? ఏజెన్సీలు ఎందుకు ఉన్నాయి? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

గ్రామాల్లోకి వెళ్తే తరిమి కొడతారు..

ఈ దేశంలో చంద్రబాబు కంటే దుర్మార్గులు ఎవరుంటారు..? టీడీపీ ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి ఏముంది..? టీడీపీ ప్రజల్లోకి వెళితే, పల్లెలకు వెళితే.. ముందు మీ హయాంలో ఏం చేశారంటూ.. టీడీపీ నాయకుల చొక్కాలు పట్టుకుని ప్రజలు కొడతారు. టీడీపీ వాళ్లు గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలతో అవినీతి చేసి బొక్కేస్తే.. జగన్‌ అధికారంలోకి వచ్చాక గ్రామగ్రామానికి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి ఆసరా, రైతు భరోసా, అమ్మఒడి పథకాల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాం, పింఛన్ డబ్బులను వాలంటీర్లే నేరుగా ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నారు. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళితే ఏం జరుగుతుందనేది తెలుస్తుంది అని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed