కన్నీటితో వ్యాధుల నిర్ధారణ

by sudharani |
కన్నీటితో వ్యాధుల నిర్ధారణ
X

దిశ, ఫీచర్స్ : వైద్యరంగంలో పుట్టుకొచ్చిన అనేక ఆవిష్కరణలు వ్యాధి నిర్ధారణ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. అనేక రకాల జబ్బులను క్షణాల్లో కనిపెట్టేయగల సాంకేతికత మన సొంతమైంది. ఇలా రోజురోజుకీ కొత్త పద్ధతులు వెలుగు చూస్తుండగా.. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేత్తలు. కొన్ని కన్నీటి చుక్కలను ఉపయోగించి మధుమేహం, కంటి వ్యాధి సంకేతాలను సులభంగా కనిపెట్టవచ్చని ప్రకటించారు. ఈ విధానంలో పురోగతి సాధించడమే తమ లక్ష్యమని చైనా, వెన్‌జౌ మెడికల్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీర్ ఫీ లియు తెలిపారు. వ్యాధిని గుర్తించేందుకు కన్నీళ్లను ఉపయోగించే అవకాశాలపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లుగా పేర్కొన్నారు.

కొత్త టెక్నిక్ ఏమిటి?

'iTEARS'గా పిలువబడే ఈ కొత్త సాంకేతికత.. కన్నీళ్ల కూర్పును విశ్లేషించేందుకు నానోటెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఎక్సోసోమ్స్(కన్నీళ్లను తయారుచేసే ఒక రకమైన చిన్న సంచి) శరీర పరమాణు సంకేతాలను మోసుకెళ్లేందుకు బాధ్యత వహిస్తాయి. ACS నానోలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ సంకేతాలను అడ్డగించి, వాటిని సరిగ్గా గుర్తించగలిగితే మధుమేహం వంటి రుగ్మతలను నిర్ధారణ చేయగలరు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ టెక్నిక్‌కు కేవలం ఐదు నిమిషాలే పడుతుంది. ఇంట్లోనే సెల్ఫ్-టెస్టింగ్ కిట్స్ రూపొందించేందుకు ఈ అత్యాధునిక పద్ధతిని ఉపయోగించాలని వెన్‌జౌ మెడికల్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీర్, అధ్యయన సహ-రచయిత ఫీ లియు భావిస్తున్నారు. వ్యాధులను గుర్తించడానికి కన్నీళ్ల సామర్థ్యాన్ని హైలైట్ చేయడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

అడ్డంకులు ఏమిటి?

లాలాజలం, మూత్రం వంటి ఇతర శరీర ద్రవాలతో పోలిస్తే కన్నీళ్లు తక్కువ మొత్తంలో లభించడం, అలాగే స్లో రికవరీ అండ్ సుదీర్ఘ ప్రాసెసింగ్ టైమ్ పరిశోధకులకు సవాల్‌గా మారింది. అందుకే లియు బృందం.. కొద్ది మొత్తంలో కన్నీళ్ల నుంచి ఎక్సోసోమ్స్(సంచుల)ను తీసేందుకు కొత్త సాంకేతికతను సృష్టించింది. ఈ మేరకు ACS నానోలో ప్రచురించిన కథనానికి సంబంధంచిన రచయితలు.. అధ్యయనంలో పాల్గొనేవారి నుంచి మొదట కన్నీళ్లు సేకరించారు. తర్వాత నానోపోరస్ పొరలతో కూడిన పరికరం కన్నీళ్లతో కూడిన ద్రావణంతో నింపినపుడు పొరలను కంపించి ద్రావణాన్ని పీల్చుకుంది. ఈ సాంకేతికత సూక్ష్మ పరమాణువులను నిమిషాల వ్యవధిలో వదిలివేసేందుకు అనుమతిస్తుంది, విశ్లేషణ కోసం సంచులను కూడా వదిలివేస్తుంది.

ఈ ఫలితాలు పరిశోధకుల కళ్లు తెరిపించాయి. వివిధ రకాలైన కళ్లు పొడిబారే వ్యాధి(Dry-Eye-Syndrome) ఉన్నట్లయితే అందుకు సంబంధించిన పరమాణు ముద్రలు ఆయా వ్యక్తుల కన్నీటిలో ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు రోగుల్లో మధుమేహం ఎలా పురోగమిస్తుందో ట్రాక్ చేసేందుకు కన్నీళ్లు వైద్యులకు సాయపడవచ్చని తెలుసుకున్నారు. ఇక హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ఈ అధ్యయన సహ రచయిత, బయో ఇంజనీర్ ల్యూక్ లీ ప్రకారం.. పరిశోధకులు ఇతర వ్యాధులు, నిరాశ లేదా భావోద్వేగ ఒత్తిడికి సంబంధించిన సంకేతాల కోసం కన్నీళ్లను పరిశీలించారు. మొత్తానికి పరిశోధనా బృందం ఈ అధ్యయన సమయంలో 'డ్రై ఐ సిండ్రోమ్‌'కు అనుసంధానించిన 426 ప్రోటీన్స్‌ను కనుగొనగలిగింది. అదనంగా డయాబెటిక్ రెటినోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు మార్చే కొన్ని సూచికలను కూడా గుర్తించారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల్లో మధుమేహం పురోగతిని పర్యవేక్షించవచ్చు.

కన్నీళ్లలో బయోమార్కర్లను వేరు చేస్తుంది

కన్నీళ్లు తక్కువ మొత్తంలో లభించే సమస్యను అధిగమించేందుకు పరిశోధనా బృందం.. వారి ప్రారంభ పద్ధతిని నవీకరించింది. కొత్తగా రూపొందించబడిన 'ఇన్‌కార్పొరేటెడ్ టియర్ ఎక్సోసోమ్స్ ఎనాలిసిస్ వయా రాపిడ్-ఐసోలేషన్ సిస్టమ్(iTEARS)'ను ఉపయోగించి ఎక్సోసోమ్స్ వేరుచేయబడ్డాయి. అడ్డంకులను తొలగించేందుకు గాను ఈ సిస్టమ్.. నానోపోరస్ పొరల అంతటా కన్నీటి ద్రవాలను ఓసిలేటరీ ప్రెజర్ ఫ్లోతో ఫిల్టర్ చేస్తుంది.

ఎక్సోసోమ్-ఉత్పన్నమైన ప్రోటీన్‌లు పరికరంలో ఉన్నప్పుడు ఫ్లోరోసెంట్‌గా లేబుల్ చేయబడవచ్చు. ఇవి అదనపు విశ్లేషణ కోసం వివిధ పరికరాలకు తరలించబడతాయి. ఇంకా, ఎక్సోసోమ్స్ న్యూక్లియిక్ ఆమ్లాలు వేరుచేయబడి అధ్యయనం చేయబడ్డాయి. తిరిగి పొందిన ప్రోటీన్ల యొక్క ప్రోటీమిక్ విశ్లేషణ ఆధారంగా పరిశోధకులు.. ఆరోగ్యకరమైన వ్యక్తులు, వివిధ రకాల పొడి కంటి అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల మధ్య తేడాను గుర్తించగలిగారు. అదేవిధంగా, డయాబెటిక్ రెటినోపతి రోగులు, కంటి సమస్యలులేని వారి మధ్య మైక్రోఆర్ఎన్ఏలలో తేడాలను గుర్తించడానికి iTEARS పరిశోధకులకు వీలు కల్పించింది. మొత్తానికి ఈ విధానం కన్నీళ్లను ఉపయోగించి అనేక వ్యాధుల పరమాణు రోగనిర్ధారణ మరింత త్వరగా, కచ్చితత్వంతో పాటు అత్యంత సురక్షిత పద్ధతుల్లో చేయొచ్చని పరిశోధనా బృందం విశ్వసిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed