తెలంగాణకు వచ్చినప్పుడల్లా నాకు సంతోషంగా ఉంటుంది: రాహుల్ గాంధీ

by GSrikanth |   ( Updated:2023-10-19 12:27:10.0  )
తెలంగాణకు వచ్చినప్పుడల్లా నాకు సంతోషంగా ఉంటుంది: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చినప్పుడుల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు తెలంగాణతో ఉన్న అనుబంధం రాజకీయాలకు సంబంధం లేదు. ప్రేమ, కుటుంబంతో ఉన్న అనుంబంధం లాంటిది. నాకంటే ముందే మీకు రాజీవ్‌, ఇందిరా, నెహ్రూలతో అనుబంధం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భరోసా ఇచ్చింది. ఇది నాకు గుర్తుంది. 2004లో తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ తెలంగాణ నిర్ణయం తీసుకున్నప్పుడే పార్టీకి రాజకీయంగా దెబ్బ తగులుతుందని తెలుసు. అయినా ప్రజలు, రైతులు, కూలీలు, యువత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజమేమంటే... పదేళ్ళ తర్వాత కూడా సోనియాగాంధీ స్వప్నం, ప్రజల స్వప్నం ముఖ్యమంత్రి నెరవేర్చలేకపోయారు.

ఎన్నికలకు ముందు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం మొదలైంది. ఒకవైపు సీఎం, ఆయన కుటుంబ సభ్యులున్నారు. మరోవైపు సర్కార్‌లోని ముఖ్యమైన శాఖలను వారి ఆధీనంలో ఉన్నాయి. భూములు, గనులు, మద్యం, శాఖలన్నీ సీఎం ఫ్యామిలీ ఆధీనంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి తరహాలో కాకుండా రాజులాగా వ్యవహరిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారు. మీరంతా భూములు ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో మీకు కలిగిన లబ్ధి ఏంటో ప్రశ్నించుకోవాలి. నీరు వచ్చిందా?.. జనానికి ఏదైనా ప్రయోజనం కలిగిందా? కేవలం సీఎం, కాంట్రాక్టర్లకే లాభం జరిగింది. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఎవరికైనా లాభం కలిగిందా? మీ భూముల్ని ప్రభుత్వం ఆ పోర్టల్ ద్వారా లాక్కున్నది. కంప్యూటరైజేషన్ పేరుతో లక్షలాది ఎకరాలను తీసుకున్నారు. రికార్డులను టాంపర్ చేసి పేదల నుంచి భూముల్ని లాకున్నారు. డబుల్ ఇండ్ల హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది? రైతుల రుణమాఫీ లక్ష రూపాయల మేరకు మాఫీ చేస్తానని చెప్పింది...

ఎంత మందికి మాఫీ అయింది? బడా భూస్వాములకే రైతుబంధుతో ప్రయోజనం కలిగింది. సింగరేణి మైనింగ్ గురించి చాలా వివరాలు తెలిశాయి. ఇక్కడి బ్లాకులను ప్రైవేటుపరం చేయనివ్వం. తొలుత అదానీకి అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ దాన్ని కాంగ్రెస్ అడ్డుకున్నది. కార్మికులకు రక్షణగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. మొత్తం దేశానిది. అదానీకి సాయం చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం. ప్రభుత్వ కోల్ గనులను ప్రైవేటు బొగ్గు కంపెనీలకు వేర్వేరు రూపాల్లో కేంద్రం అప్పించాలనుకుంటున్నది. నరేంద్ర మోడీ ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తున్నది. కార్మికులు, రైతులకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటామని నేను హామీ ఇస్తున్నాను. మన మధ్య ఉన్న సంబంధం కుటుంబ అనుబంధం, ప్రేమతో కూడినది. దళితులకు మూడెకరాలు ఇస్తామన్ని కేసీఆర్ ఇవ్వలేదు. మాట తప్పాడు. మోడీ 15 లక్షలను బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నాడు. వేయకుండా మోసం చేశాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు భరోసా కలిగిస్తున్నది. మేం అబద్ధాలు చెప్పం. అవసరమైతే కర్ణాటక, చత్తీస్‌గడ్ , రాజస్థాన్ వెళ్ళి చూడండి. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. మహిళలకు,రైతులకు ఇచ్చినవి అమలవుతున్నాయి. విద్యుత్ సబ్హిడీ కూడా అమలవుతున్నది.’’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed