సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే భర్త.. తడి బట్టలతో ఆలయంలో ప్రమాణం

by GSrikanth |   ( Updated:2023-09-07 06:50:42.0  )
సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే భర్త.. తడి బట్టలతో ఆలయంలో ప్రమాణం
X

దిశ, పాపన్నపేట: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవం కాదని, నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అది నిరూపించడానికే ఏడుపాయల వన దుర్గమ్మ సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశానని స్థానిక ఎమ్మెల్యే పద్మా భర్త, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు చేసిన ఆరోపణలు, సవాల్‌ను స్వీకరించిన దేవేందర్ రెడ్డి.. గురువారం ఏడుపాయల దేవస్థానానికి చేరుకొని తడి బట్టలతో వనదుర్గామాతను దర్శించుకొని ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలే నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ పదేళ్లలో మెదక్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అధికారి, కాంట్రాక్టర్ల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. అవినీతికి పాల్పడాలని ఏ కార్యకర్తకు కూడా చెప్పలేదన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామే తప్ప, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు.

ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఓ ప్రణాళిక బద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల్లో చిరకాలంగా గుర్తుండి పోవడానికే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నామన్నారు. రూ.30 లక్షల టర్నోవర్ ఉన్న కోనాపూర్ సొసైటీని రూ.40 కోట్ల టర్నోవర్ చేశానన్నారు. అలాగే రూ.4 కోట్ల స్థిరస్తులు చేశానని పేర్కొన్నారు. నా మీద ఒక్క రూపాయి కూడా అవినీతి చూపిస్తే రూ.10 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. చిన్న శంకరంపేట్‌లో భూవివాదంలో అక్రమాలు చేశానని ఆరోపణలు చేశారని, ఎలాంటి భూముల్లో అవినీతికి పాల్పడలేదన్నారు. తప్పులు చేసిన కార్యకర్తలను మందలించానే తప్ప నేనెప్పుడూ తప్పు చేయలేదన్నారు. ఇసుకలో చేసిన ఆరోపణలు కూడా అవాస్తవమన్నారు. అడ్వకేట్, ఇఫ్కో డైరెక్టర్ గానే తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడి సొమ్ము చేసుకోవడంలేదన్నారు. ఏడుపాయలో అవినీతికి పాల్పడ్డానని నాపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారని, దీంతో సీఎం నాకు చివాట్లు పెట్టాడని చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు.

నాపై ఆరోపణలు చేసిన వారందరూ గతంలో నా పరంగా లబ్ధి పొందిన వారేనని పేర్కొన్నారు. ఎంతో మంది యువతీ, యువకులు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అందజేశామన్నారు. సుమారు 500 దేవాలయాల్లో నా కాంట్రిబ్యూషన్ ఉందని పేర్కొన్నారు. నేను సంపాదించిన ఆస్తిలో 80 శాతం సమాజ సేవకు ఖర్చు పెడతానని అమ్మవారి సాక్షిగా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. 60 సంవత్సరాలు వచ్చినంత వరకు సంపాదించిన ఆస్తిని నా కుటుంబ సభ్యులకు, ఆ తరువాత సంబంధించిన ఆస్తి సమాజానికి ఖర్చు పెడతానని వెల్లడించారు. ఈయన వెంట మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పాపన్నపేట మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed